శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (14:39 IST)

వనదుర్గా భవనా ఆలయ ఈవోకు కరోనా ... వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేత

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో)కు కరోనా వైరస్ సోకింది. రెండు రోజులుగా జ్వరం వస్తుండటంతో అనుమానం వచ్చిన ఆయన మెదక్‌ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ ఫలితం వచ్చింది. 
 
మందులు వేసుకుంటున్నా జ్వరం తగ్గక పోవడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చెస్ట్‌ స్కాన్‌ చేయించుకోవడంతో అందులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాద్‌కు వెళ్లి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారికి, ఆలయ సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు.
 
ఇదిలావుంటే, ఈవో కరోనా బారిన పడటంతో భక్తుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏడుపాయల ఆలయాన్ని శుక్రవారం నుంచి వారం రోజుల పాటు మూసి వేస్తున్నట్లు మెదక్‌ ఆర్డీవో సాయిరాం వెల్లడించారు. అమ్మవారికి చేసే పూజలు, అభిషేకాలు తదితరాలు యధావిధిగా కొనసాగుతాయని, భక్తులకు మాత్రం ఆలయంలోకి ప్రవేశానికి అనుమతి లేదన్నారు.