బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (14:10 IST)

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. సచివాలయం కట్టితీరుతాం : కేసీఆర్

ప్రస్తుత సచివాలయం అడ్డదిడ్డంగా ఉండటంతో ప్రభుత్వ కార్యకలాపాలకు ఇబ్బందిగా ఉందని, అందువల్ల తాము అనుకున్నట్టుగా కొత్త సచివాలయాన్ని నిర్మించి తీరుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు.

ప్రస్తుత సచివాలయం అడ్డదిడ్డంగా ఉండటంతో ప్రభుత్వ కార్యకలాపాలకు ఇబ్బందిగా ఉందని, అందువల్ల తాము అనుకున్నట్టుగా కొత్త సచివాలయాన్ని నిర్మించి తీరుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. సెక్రటేరియట్ అంటే రాష్ట్రానికి గొప్పగౌరవ సూచకమన్నారు. అందువల్ల కొత్త సచివాలయాన్ని కట్టి తీరుతామని.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. 
 
కొత్త సచివాలయ నిర్మాణం గురించి చెప్పినప్పుడు ప్రధాని మోడీ కూడా శుభాకాంక్షలు తెలిపారని సీఎం గుర్తుచేశారు. బుధవారం జరిగిన తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నూతన సచివాలయంపై సీఎం మాట్లాడారు. భారతదేశంలో 29 రాష్ట్రాలకు సచివాలయాలుంటే.. ఇంత పలికిమాలిన సచివాలయం ఏ రాష్ట్రానికి లేదన్నారు. ఇంత అడ్డదిడ్డమైన సచివాలయాన్ని ఎక్కడా చూడలేదన్నారు. 
 
ఏ బిల్డింగ్ కూడా నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. సెక్రటేరియట్‌లో సీఎం ఉండే సీ బ్లాక్ అధ్వాన్నంగా ఉందన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైరింజన్ పోయి ఆపరేట్ చేసే స్థలం లేదన్నారు. సీ బ్లాక్ అయితే మరీ దారుణంగా ఉందన్నారు. ఇష్టం వచ్చిన రీతిలో సచివాలయాన్ని కట్టారని ధ్వజమెత్తారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైర్ సెఫ్టీ పూర్తిగా లోపించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి పోయినా అక్కడి సచివాలయం ఆ రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా ఉంటుందన్నారు. మనం కూడా అలాగే నిర్మించుకోవాలన్నారు.  
 
మొదటగా సచివాలయం, శాసనసభను నిర్మిస్తామన్నారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రధాని నరేంద్ర మోడీతో భూమిపూజ చేయిస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు చారిత్రక కట్టడాన్ని అందించి ఇస్తామన్నారు. గతంలో కూడా నీలం సంజీవరెడ్డి, బ్రహ్మనందరెడ్డి కూడా ఇప్పుడున్న సచివాలయాన్ని మార్చాలని ప్రతిపాదించారు. కానీ అది అమలు కాలేదన్నారు. ఏదో తాను ఇప్పుడు కొత్తగా చేస్తున్న ప్రతిపాదన కాదని సీఎం స్పష్టం చేశారు. 
 
సచివాలయ నిర్మాణంపై అనవసర రాద్ధాంతం చేస్తున్న బీజేపీకి ఆయన స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. కొత్త సెక్రటేరియట్‌ను కట్టి తీరుతామని స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతోనే సెక్రటేరియట్‌ను కడతామన్నారు. సెక్రటేరియట్ నిర్మాణాన్ని ప్రధాని మోడీ కూడా ప్రశంసించారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.