తెలంగాణాలో వరద బీభత్సం - 19 వేల మంది పునరావాస కేంద్రాలకు తరలింపు
తెలంగాణ రాష్ట్రంలో వరద బీభత్సం సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ వరద వచ్చింది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో దాదాపు 19 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వరద పరిస్థితి, వరద సహాయం, పునరావాస కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్ అధికారులతో సమీక్షించిన సీఎస్.. రాష్ట్రంలో 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల పరిస్థితి అదుపులోనే ఉందని, ఏ విధమైన భారీ నష్టం జరగలేదని వెల్లడించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ములుగు, భూపాలపల్లి, భద్రాచలం జిల్లాలపై మరింత అప్రమత్తంగా ఉన్నామన్నారు.
ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని కాపాడామని వివరించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు 16 మందిని, వైమానిక దళం ఇద్దరిని రక్షించాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 223 ప్రత్యేక శిబిరాల్లో 19,071 మంది ఆశ్రయం పొందుతున్నారన్న సీఎస్.. భద్రాచలంలోని 43 శిబిరాల్లో 6,318 మంది, ములుగు జిల్లాలోని 33 శిబిరాల్లో 4,049 మంది, భూపాలపల్లి జిల్లాలోని 20 శిబిరాల్లో 1,226 మందికి ఆశ్రయం కల్పించామన్నారు.