పాము నుంచి యజమాని ప్రాణాలను కాపాడిన కుక్క..!!
తన యజమానిని కరిచేందుకు ప్రయత్నించిన పామును కుక్క నోట కరిచింది. యజమాని ప్రాణాలను రక్షించి.. పాము కాటేయడంతో కుక్క మరణించిన అరుదైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో కిషోర్ ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నా సమయంలో వెనుక గదిలో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో గదిలోకి తాచుపాము వెనుక పైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించింది.
దీన్ని గమనించిన స్నూపీ(కుక్క) పరుగున ఇంట్లోకి వెళ్లి తాచుపాముపై దాడి చేసింది. వెంటనే లేచిన కిషోర్ కర్రతో పామును కొట్టబోయాడు. తాచుపాము కిషోర్‌పైకి తిరగబడింది.
స్నూపి(కుక్క) పాముపై దూకి నడుము భాగంలో నోటితో గట్టిగా పట్టుకుంది. దీంతో పాము స్నూపిని కాటేసింది. అయినా అది లెక్కచేయకుండా పామును బయటకు లాక్కొచ్చింది.
కిషోర్ కర్రతో పామును చంపి స్నూపిని ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మరణించింది. ఎంతో ప్రేమతో పెంచుకున్న కుక్క ప్రాణాలకు తెగించి కాపాడిందని, కానీ చివరకు కుక్క దక్కకుండా పోయిందని కుటుంబమంతా శోకసంద్రంలో మునిగారు.
మెదక్ జిల్లాలో 50 తాచు పాములు..
పామును చూస్తే ఎవరికైనా ప్రాణభయం. అలాంటిది ఒక్కసారిగా కుప్పలు తెప్పలుగా తాచు పాము పిల్లలు బయటపడి అటూ ఇటూ పరుగులు తీస్తుంటే పైప్రాణాలు పైనే పోయినంత పనవుతుంది.
ఇందుకు భిన్నంగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లికి చెందిన మహిళ 50 తాచు పాములను కర్రతో కొట్టి చంపేశారు.
గవలపల్లిలోని కొంక లచ్చల్ అనే వ్యక్తి భార్య స్వరూపతో కలిసి తన వాకిట్లోని బండ రాళ్లను తొలగిస్తుండగా.. దానికింద నుంచి పదుల సంఖ్యలో పాములు బయటకు వచ్చాయి.
స్వరూప వెంటనే ఒక కర్రను తీసుకొని వెంటాడి సర్పాలను చంపేశారు. విషం ఉండే తాచుపాములు కావడంతో ప్రాణభయంతో చంపేశామని.. తల్లి పాము కనిపించలేదని చెప్పారు.