గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (11:39 IST)

ఆ జలవిద్యుత్‌ కేంద్రం ఇరవయ్యేళ్ల చరిత్రలో ఇదే తొలి ప్రమాదం

శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ఇక్కడ 20 ఏళ్లుగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. గత నెల 17వ తేదీ నుంచి భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది.

జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులు 1988లో ప్రారంభయ్యాయి. తొలిసారిగా 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఆ తర్వాత మొత్తం 6 యూనిట్లను మూడేళ్లలో పూర్తి చేశారు. ఒక్క యూనిట్‌కు 150 మెగావాట్ల చొప్పున విద్యుత్‌ కేంద్రం మొత్తం 900 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. 
 
శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 870 అడుగులకు తగ్గకుండా ఉన్నంత వరకే కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు. అయితే ఈ ప్రమాదం జరగడం వల్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది.

జలాశయంలో నీరు సమృద్ధిగా ఉంటే రోజుకు 21 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అయితే ప్రమాదం కారణంగా తెలంగాణ రాష్ట్రానికి జల విద్యుత్‌ కేంద్రం ద్వారా అందించే 900 మెగావాట్ల విద్యుత్‌ కోల్పోయింది.