శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జూన్ 2022 (12:19 IST)

పాత చలానా చెల్లింపు.. అరగంట ఆలస్యం.. చిన్నారి మృతి

 boy
పాత చలానా చెల్లింపులో అరగంట ఆలస్యం మూడు నెలల చిన్నారిని బలిగొంది. కారులో ప్రాణాపాయస్థితిలో ఉన్న బాబును చూసినా ఖాకీల మనసు కరగలేదు. చలానా డబ్బులు చెల్లించిన తర్వాతే వదిలేస్తామన్న పోలీసుల అమానవీయవైఖరి ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ఈ విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. జనగామ మండలం మరిగడి గ్రామానికి చెందిన మచ్చ మల్లేశం, సరస్వతి దంపతులకు మూడునెలల క్రితం బాబు జన్మించాడు. ఈ క్రమంలో చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు.
 
వెంటనే తల్లిదండ్రులు ఓ అద్దె కారును తీసుకుని బాబుతోసహా బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి సమీపంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు చేస్తూ ఆ కారును ఆపారు. కారుకు సంబంధించి వెయ్యి రూపాయల పెండింగ్‌ చలానా ఉన్నట్లు ఆన్‌లైన్‌లో గుర్తించారు. పోలీసులు వెంటనే డ్రైవర్‌ వద్ద ఉన్న ఒరిజినల్‌ లైసెన్స్‌ తీసుకుని, చలానా కట్టిన తర్వాత కారు తీసుకెళ్లాలని సూచించారు.  
 
ఆస్పత్రికి తీసుకెళ్తున్నామన్నా పోలీసులు కనికరించలేదు. దీంతో చలానా వెంటనే చెల్లిస్తానని అతడు వేడుకోవడంతో కారును వదిలిపెట్టారు. అప్పటికే అరగంట గడిచిపోయింది.
 
ఆ తర్వాత నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి బాబు చనిపోయాడని చెప్పడంతో తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన గారాల పట్టి ఇక లేడంటూ బోరున విలపించింది.