బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (12:46 IST)

నేటి నుంచే నిజరూప దర్శనం: సంప్రోక్షణ ముగిసిన వెంటనే..?

Yadagiri
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం ఇవ్వనున్నారు. 
 
ఈ నెల 21 నుంచి నిర్వహించిన పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు సంప్రోక్షణ చేస్తారు. దివ్య విమానంపై శ్రీసుదర్శన స్వర్ణ చక్రానికి, ఆలయం చుట్టూ ఉన్న ఆరు రాజగోపురాలపై ఉన్న స్వర్ణ కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులు సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఈ క్రతువులో సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా పాల్గొంటారు.
 
బాలాలయంలో 2016 ఏప్రిల్‌ 21 నుంచి ప్రతిష్ఠామూర్తుల దర్శనాలు కొనసాగుతుండగా, ఆదివారం రాత్రి నుంచే బాలాలయంలో దర్శనాలకు తెరపడింది.
 
ఆలయం చుట్టుపక్కల ఎటుచూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. భక్తులను కొండపైకి చేర్చడానికి ‘యాదాద్రి దర్శిని’ పేరుతో ఆర్టీసీ బస్సులను తీర్చిదిద్దారు. ‘యాదాద్రి జలప్రసాదం’ పేరుతో వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 
 
భక్తుల దర్శనాలకు సంబంధించి ఆన్‌లైన్‌ బుకింగ్‌ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. విష్ణు పుష్కరిణి, లక్ష్మీ పుష్కరిణిని సోమవారం ఉదయం ప్రారంభిస్తారు. దీక్షాపరుల మండపాన్ని కూడా ప్రారంభించి, అందులోనే భక్తులకు అన్నదానం నిర్వహించనున్నారు.
 
మహాకుంభ సంప్రోక్షణకు వచ్చే వీఐపీలు, వీవీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాదాద్రి అణువణువూ నారసింహుడి జపం చేస్తుంటే.. అడుగడుగునా పోలీసులు భక్తులకు భద్రత కల్పిస్తున్నారు. దాదాపు 3 వేల మంది పోలీసులు యాదాద్రి చుట్టూ పహారా కాస్తున్నారు. 
 
సోమవారం నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభు పునర్దర్శనం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.  
 
ఇప్పటికే పాంచరాత్ర ఆగమ విధానాలతో ఆదివారం మహాయాగ క్రతువు, ప్రధానాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం, షోడశ కళాన్యాస హోమం, పంచశయ్యాధివాసం కన్నులపండువగా జరిగాయి. శాస్త్రోక్తంగా 108 కలశములతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు.