ధాన్యం సేకరణపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
యాసంగిలో తెలంగాణలో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ కేసీఆర్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. యాసంగిలో వచ్చే మొత్తం ధాన్యాన్ని కేంద్రం చేత కొనిపించడమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీకి బుధవారం లేఖ రాశారు.
ఈ వ్యవహారంపై కేంద్రాన్ని ఒప్పించేందుకు ఇప్పటికే ఓ కార్యాచరణను రూపొందించిన కేసీఆర్.. కేంద్ర మంత్రులతో భేటీ కోసం తన మంత్రివర్గ సహచరుల బృందాన్ని ఇప్పటికే ఢిల్లీ పంపారు.
ఒకే దేశం ఒకే ధాన్యం సేకరణ విధానం అన్న నినాదాన్ని ఆ లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన కేసీఆర్.. ఈ విషయంపై ఓ విధాన పరమైన నిర్ణయం తీసుకునేందుకు ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని ప్రధానికి సూచించారు.
అంతేకాకుండా పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ఫలితం సాధించే దిశగా కదలాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.