పాముకాటుకు గురై మూడేళ్ల చిన్నారి మృతి
మూడేళ్ల చిన్నారి పాముకాటుకు గురైంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలకో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవీపేట మండలం బినోలకు చెందిన మంగళి భూమయ్య, హర్షిత దంపతులు. వీరికి కుమారుడు రుద్రాన్ష్ (3), మూడు నెలల కుమార్తె ఉన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంట్లో ఉన్న ఓ గది కూలిపోయింది. దీంతో భూమయ్య కుటుంబం శుక్రవారం పక్కనున్న మరో గదిలో నిద్రించారు. గాఢనిద్రలో ఉండగా.. రెండు పాములు వచ్చి రుద్రాన్ష్‌ను కాటు వేశాయి. బాలుడు నిద్రలోనే గట్టిగా ఏడవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై నిద్రలేచారు.
బాలుడికి సమీపంలో రెండు పాములు వెళ్లటాన్ని భూమయ్య గమనించాడు. వెంటనే వాటిని కర్రతో కొట్టి చంపాడు. అనంతరం చిన్నారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చిన్నారి ఇవాళ మృతి చెందాడు.