అవును.. ఈ బచ్చాగాళ్లే తెలంగాణ తెచ్చారు : కేటీఆర్
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలపై తెరాస నేత, మాజీ మంత్రి కేటీఆర్ తనదైనశైలిలో మాటల దాడి చేశారు. పరుష పదజాలంతో తిట్ల దండకం వినిపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు బలుపు ఎక్కువంటూ మండిపడ్డారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ యువత వీర సైనికుల్లాగా ఉద్యమిస్తుంటే.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లను పట్టుకున్న వ్యక్తి ఉత్తమ్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలోని ఛోటామోటా నాయకులందరూ చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా, తాను గట్టిగా మాట్లాడితే బచ్చా అని అంటున్నారనీ, కాంగ్రెస్ దద్దమ్మలు ఇంట్లో దాక్కుంటే ఈ బచ్చాగాళ్లే ప్రత్యేక తెలంగాణను తెచ్చారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు సైనికుడే కాదనీ, ఆయన ఓ బంట్రోతు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యార్థులంతా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాహుల్ కుటుంబానికి, తెలంగాణ ప్రజల పౌరుషానికి మధ్యే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు.