సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By vasu
Last Modified: గురువారం, 27 సెప్టెంబరు 2018 (18:18 IST)

తెలంగాణలో వరుస హత్యలు... మంత్రి కేటీఆర్ ఈ విధంగా అన్నారు...

హైదరాబాద్ మరోసారి ఉలిక్కిపడింది... ఎర్రగడ్డ ప్రాంతంలో కుమార్తె, ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తపై మనోహరాచారి చేసిన దాడిని జనాలు మరువక ముందే... పట్ట పగలే... నడి రోడ్డులో... ట్రాఫిక్ కానిస్టేబుల్ సాక్షిగా మరో హత్య జరిగింది. కాకపోతే ఈ సారి ఇది పరువు హ

హైదరాబాద్ మరోసారి ఉలిక్కిపడింది... ఎర్రగడ్డ ప్రాంతంలో కుమార్తె, ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తపై మనోహరాచారి చేసిన దాడిని జనాలు మరువక ముందే... పట్ట పగలే... నడి రోడ్డులో... ట్రాఫిక్ కానిస్టేబుల్ సాక్షిగా మరో హత్య జరిగింది. కాకపోతే ఈ సారి ఇది పరువు హత్య కాదు... ప్రతీకార హత్య.
 
వివరాలలోకి వెళ్తే... ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఈ హత్య వెనుక అసలు కారణం అక్రమ సంబంధమని తెలుస్తోంది. ప్రాణ స్నేహితులైన రమేష్, మహేష్‌లు ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య స్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో రమేష్ 2017, డిసెంబరు 24న మహేష్‌కు ఫుల్‌గా మద్యం తాగించి, నిద్రలోకి జారుకున్న తర్వాత మహేష్ గొంతుకోసి శంషాబాద్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ కేసులో అరెస్టయిన రమేష్ ఇటీవల బెయిల్‌పై వచ్చాడు. 
 
ఉప్పరపల్లి కోర్టులో హాజరై ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తున్న రమేష్‌ను ఇద్దరు దుండగులు వెంటాడడంతో ఆటో నుంచి బయటకు దూకి పరుగులు తీసిన తనను కాపాడమని వేడుకున్నాడు. ఇది గమనించిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించి గొడ్డలితో వెంటాడుతున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అయితే, ఈలోగా మరో దుండగుడు రమేష్‌ను గొడ్డలితో నరికేసాడు. కానిస్టేబుల్‌ పట్టు విడిపించుకున్న దుండగుడు ప్రాణం పోయే వరకు నరుకుతూనే ఉన్నాడు. స్థానికులు సైతం వారిని అడ్డుకోడానికి విఫలయత్నం చేశారు. 
 
పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నా.. దుండగులు ఎంత మాత్రమూ భయపడకపోవడం చూస్తూంటే వారివురూ పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ హత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. రమేష్ చేతిలో హత్యకు గురైన మహేష్ గౌడ్‌ తండ్రి, మేనమామ ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, ఈ వరుస హత్యలపై స్పందించిన కేటిఆర్... క్షేత్ర స్థాయి పోలీసులకు ఆయుధాలను అందజేయాలని, వెంటనే అప్రమత్తమై, స్పందించేలా వారికి తగిన శిక్షణ అందించాలని ట్విట్టర్‌లో స్పందించారు.