త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా: రేవంత్ రెడ్డి
త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రావిరాలలో నిర్వహించిన రాజీవ్ రైతు రణభేరి బహిరంగ సభలో ఈ పాదయాత్ర విషయాన్ని ఆయన వెల్లడించారు.
తన పాదయాత్రతో ఉప్పెన సృష్టిస్తానని.. ఉప్పెనలా కేసీఆర్‌ను కప్పేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. పాదయాత్రకు అధిష్టానం అనుమతి తీసుకుంటానన్నారు. కేసీఆర్, మోడీ ఇద్దరు తోడుదొంగల బడతం పట్టడానికే యాత్ర చేస్తానని చెప్పారు. కేసీఆర్‌ను గొయ్యి తీసి పాతిపెట్టడానికే తన పాదయాత్ర అని చెప్పారు.
కేసీఆర్ మీ భూమి 25లక్షల చొప్పున ఇస్తావా. 48గంటల్లో సొమ్ము చెల్లిస్తా. నీ భూమి ఉండాలే.. పేదల భూములు మాత్రం లాక్కుంటావా. కేసీఆర్‌ను తప్పులు చూపి మోడీ లొంగదీసుకున్నాడు. కానీ ప్రజల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ లొంగదీసుకోలేరు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ యజమాని కాదు. అంబానీ, అదానిలకు రైతులను తెగనమ్ముతుంటే ఒక రైతు బిడ్డగా నేను ఎలా ఊరుకుంటా?
రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎందుకు వెళ్లడం లేదనే గాడిదలకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదా. మోడీ అఖండ భారత రైతుల గొంతు కొస్తున్నారు. పార్లమెంట్‌లో మంద బలంతో నల్ల చట్టాలు తెచ్చారు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.