మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (20:09 IST)

ఇందిరమ్మ ఇళ్లను గుంజుకుంటున్న విలన్ కేసీఆర్: భట్టి విక్రమార్క

సినిమాల్లో విలన్లు ఊరి మీద పడి పేద, దళితుల భూములు లాక్కునట్లుగా.. కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. నాటి ఇందిరమ్మ ప్రభుత్వం దళిత, గిరిజన ప్రజల భూములను కేసీఆర్ గుంజుకుంటున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో ముఖముఖిలో భాగంగా సిఎల్పీ నేత భట్టి విక్రమార్క జడ్చెర్ల నియోజకవర్గం గంగాపూర్ గ్రామంలో పర్యటించారు.
 
ఈ కార్యక్రములో భట్టితో పాటు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ కోదండ రెడ్డి, తెలంగాణ కిసాన్ సెల్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మహబూబ్ నగర్ డీసీసీ ప్రెసిడెంట్ ఒబెదుల్లా కొత్వాల్, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉద్దండాపూర్ గ్రామ ప్రజలకు ఆర్.అండ్.ఆర్ ప్యాకేజీ కచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాక 2013 భూ సేకరణలు చట్టం ప్రకారమే బాధితులకు నష్టపరిహారం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్దండాపూర్ రిజర్యాయర్ లో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి ఇండ్లు కట్టించాలని, భూములు కోల్పోయిన వారికి భూములు, అదే దళిత గిరిజనులకు రెండింతల భూములు ఇవ్వాలని భట్టి చెప్పారు.
 
అదే విధంగా డబ్బులు ఇవ్వాల్సివస్తే మార్కెట్ రేటుకు మూడింతలు ఇవ్వాలని డిమాండ్ భట్టి చెప్పారు. గ్రామప్రజలకు వివరాలు చెప్పకుండా సర్వే చేయడం ఏమిటని ప్రభుత్వాన్ని భట్టి ప్రశ్నించారు. ఇదేమని అడిగిన రైతులను పోలీసుల చేత బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం అనేది దురదృష్టకరమని అన్నారు.

ఉద్దండాపూర్ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని భట్టి అన్నారు. ఉద్దండాపూర్ ప్రజలకు న్యాయం చేయకుండా ఇండ్లు ఖాళీ చేయించడం కుదరదని అన్నారు. అవసరమైతే ఆ ప్రజల కోసం ఆ గ్రామానికి సిఎల్పీ పక్షం అంతా కలిసివస్తామని భట్టి విక్రమార్క మీడియాకు చెప్పారు.