వెండితెరపై మరో బయోపిక్... అలనాటి జమునగా మిల్కీబ్యూటీ
భారతీయ చిత్రపరిశ్రమలో బయోపిక్ మూవీలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే పలు బయోపిక్‌లు దృశ్యకావ్యాలుగా వచ్చి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అలాగే, తెలుగులోకూడా మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ సాధింది. ఇందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రను పోషించింది. ఇపుడు మరో అలనాటి నటి జమున జీవిత చరిత్ర బయోపిక్ మూవీగా రానుంది. ఇందులో మిల్కీబ్యూటీ హీరోయిన్‌గా నటించనుంది.
ఇటీవల విడుదలైన దేవినేని చిత్రాన్ని తెరకెక్కించిన శివనాగు ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారట. స్క్రిప్టుపనుల్లో భాగంగా ఆయన ఇప్పటికే జమునను కలిసినట్లు సమాచారం. అయితే, అటు నటనతో పాటు డ్యాన్సుతోనూ ప్రేక్షకులను ఎంతోకాలం పాటు అలరించిన జమున పాత్రకు మిల్కీబ్యూటీ తమన్నా అయితే న్యాయం చేయగలుగుతుందని ఆమెను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్, నాగేశ్వరరావు, ఎస్వీరంగారావు, కృష్ణవంటి అగ్రనటులతో తెరను పంచుకున్న నటి జమున. అప్పట్లో ఆమెతో సినిమా చేసేందుకు ఎంతోమంది దర్శకనిర్మాతలతో పాటు యువహీరోలు ఆసక్తి చూపించేవారు. కర్ణాటకకు చెందిన ఈ కన్నడ కస్తూరి కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఎన్నో సినిమాలు చేశారు.
తెలుగు చిత్రసీమలోనే ఆమె ఎక్కువ సినిమాలు చేయడం విశేషం. ఇదిలావుంటే.. ఈ బయోపిక్‌కు సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు తమన్నా సైతం ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. గోపిచంద్‌తో కలిసి ఆమె నటించిన సీటీమార్ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.