దుల్కర్ సల్మాన్ రాంగ్ రూటులో వెళ్ళాడా..? వీడియో వైరల్
దుల్కర్ సల్మాన్ అంటేనే పెద్దగా ఎవ్వరికీ పరిచయం అక్కర్లేదు. తన సహజమైన నటనతో ఆకట్టుకుంటూ.. స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. మలయాళ నటుడైనా.. ఇతర భాషల్లో నేరుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. దుల్కర్.. తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటిలో జెమిని గణేషన్‌గా అందరిని తన నటనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులను దోచుకున్నాడు.
తాజాగా దుల్కర్ సంబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మలయాళం యంగ్ హీరో ట్రాఫిక్ నియమాలు పక్కనపెట్టి రాంగ్ రూట్‌లో వెళ్లిపోయాడట. దీంతో ఆయన కోసం ఎదురుచూస్తున్న పోలీసులు ఓ సిగ్నల్ దుల్కర్‌ను పట్టుకున్నారు.
కేరళలోని ఓ చోట సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న హీరో దుల్కర్ సల్మాన్ బ్లూ కలర్ పోర్స్చే కారును తప్పుగా నడుపుతున్నట్లు గుర్తించారు అక్కడి పోలీసులు. దానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో ట్రాఫిక్ పోలీసు దుల్కర్ దగ్గరకు వెళ్లి హెచ్చరించాడు. దుల్కర్ లైన్ క్రాస్ చేసి రావడం వలన కారును రివర్స్ తీసుకోవాలని చెప్పడంతో.. మొదట్లో బలవంతం చేసి తర్వాత తన తప్పు అంగీకరించాడు దుల్కర్. ఇక దానికి సంబంధించిన ఆ ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.