1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 జులై 2025 (12:24 IST)

ప్రభుత్వ రాయితీలు.. సహకారం అక్కర్లేదు : ఆర్ నారాయణ మూర్తి

narayanamurthy
చిత్రపరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందేందుకు రాయితీలతోపాటు ప్రభుత్వ సహకారం కావాలంటూ అనేక మంది నిర్మాతలు కోరుతున్నారు. అయితే, నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన ఆర్ నారాయణ మూర్తి తద్విరుద్ధంగా వ్యాఖ్యానించారు. తన సినిమాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అక్కర్లేదని ఆయన తేల్చి చెప్పారు. 
 
స్వీయ దర్శకత్వంలో ఆర్. నారాయణమూర్తి నటించిన 'యూనివర్సిటీ పేపర్ లీక్' మూవీ వచ్చే నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ థియేటర్లో పలువురు ప్రజా ప్రతినిధులు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు ఈ మూవీని వీక్షించారు. నారాయణమూర్తికి అభినందనలు తెలిపారు.
 
ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం నుంచి రాయితీలు వద్దని, సినిమాను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. అద్దంకి దయాకర్ తాను ప్రభుత్వంతో మాట్లాడి 'యూనివర్సిటీ పేపర్ లీక్' సినిమాకి టాక్స్ లేకుండా చేస్తానన్నారని, అలాగే తమ శ్రేయోభిలాషి, ప్రముఖ కవి అందెశ్రీ కూడా ఈ సినిమాకి టాక్స్ రాయితీ ఇప్పించాల్సిందిగా దయాకర్‌ను కోరారని, ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
 
అయితే, తన సినిమాకు ట్యాక్స్ ఫ్రీ అవసరం లేదని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి తనకు ఏ సహకారం అవసరం లేదని, అయితే వారి నుంచి తాను కోరుకునేది ఈ సినిమాను ప్రమోట్ చేయడమేనన్నారు. సినిమా జనాల్లోకి వెళ్లేలా చేస్తే, ఏ మాత్రం సినిమా బాగున్నా జనానికి కనెక్ట్ అయి సక్సెస్ అవుతుందని అన్నారు.