సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (11:18 IST)

శ్రీకాంత్ పుట్టినరోజు.. మెగాస్టారే స్ఫూర్తి.. చిరంజీవికి నమ్మినబంటు.. పవనెంతో..?

SriKanth
తెలుగు హీరో శ్రీకాంత్ హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు అవతారాల్లో కనిపించారు. హీరో విలన్ కామెడీ ఇలా ఒకటి కాకుండా అన్ని పాత్రల్లో మెప్పించిన అరుదైన నటుడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 100 సినిమాలకు పైగా నటించాడు. మార్చి 23వ తేదీ శ్రీకాంత్ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్, జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.. 
 
పాతికేళ్ల కింద ఆయన ఇమేజ్ ఓ రేంజ్‌లో ఉండేది. ఏడాదికి అరడజను సినిమాలు చేసేవాడు. ఇప్పటికి శ్రీకాంత్ అంటే బిజీ ఆర్టిస్ట్. ఒకవైపు అడపాదడపా హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. 1968 మార్చి 23న కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతిలో జన్మించాడు శ్రీకాంత్. చిన్నప్పటి నుంచి నటుడు కావాలనేది ఈయనకున్న ఆశ. 
 
అందుకే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో చేరి డిప్లమా కూడా పొందాడు. చిన్ననాటి నుంచి కూడా చిరంజీవి సినిమాలు చూసి మరింత ఇన్స్పైర్ అయ్యాడు శ్రీకాంత్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అదే చిరంజీవికి నమ్మినబంటుగా మారిపోయి.. అతడి తమ్ముడు లిస్టులో చేరిపోయాడు. తనకు పవన్ కల్యాణ్ ఎంతో శ్రీకాంత్ కూడా అంతే అని చాలా సార్లు చిరంజీవి చెప్పాడంటే శ్రీకాంత్‌పై మెగాస్టార్‌కు ఎంత ప్రేమ ఉందో అర్ధం అయిపోతుంది. 
 
ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అవకాశాలు కోసం చాలా కష్టపడ్డాడు శ్రీకాంత్. తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా ఈయన వదులుకోలేదు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమాతో తొలిసారి స్క్రీన్ మీద కనిపించాడు. ఆ సినిమా కోసం ఆయన ఐదు వేల రూపాయల పారితోషికం అందుకున్నాడు.
 
అక్కడి నుంచి చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకోవడం మొదలుపెట్టాడు శ్రీకాంత్. కెరీర్ మొదట్లో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అబ్బాయిగారు, వారసుడు లాంటి చాలా సినిమాల్లో నెగిటివ్ పాత్ర చేశాడు శ్రీకాంత్. తొలిసారిగా వన్ బై టు సినిమా హీరో అయ్యాడు.  
 
అలా రామానాయుడు నిర్మించిన తాజ్ మహల్ సినిమాతో క్రేజీ హీరో అయ్యాడు. అందులో వివాదాస్పద హీరోయిన్ మోనికా బేడీ నటించింది. ఆ వెంటనే వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పెళ్లి సందడి సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు శ్రీకాంత్. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.  
 
అలా శ్రీకాంత్ నటించిన 90టీస్ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, మా నాన్నకి పెళ్లి, కన్యాదానం, ప్రేయసి రావే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు శ్రీకాంత్‌ను తిరుగులేని హీరోగా నిలబెట్టాయి. ఆయనకు అప్పట్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. అప్పట్లో చంద్రలేఖ సినిమాలో శ్రీకాంత్ అభిమానిగా నాగార్జున కనిపించడం విశేషం. 
 
క్షేమంగా వెళ్లి లాభంగా రండి, చాలా బాగుంది, దేవుళ్ళు, నిన్నే ప్రేమిస్తా, ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన లాంటి విజయాలు ఈయన ఖాతాలో ఉన్నాయి. ఇన్నేళ్ల కెరీర్లో 125 సినిమాలు చేశాడు శ్రీకాంత్. అందులో చాలా వరకు ఫ్లాపులు ఉన్నా కూడా హిట్ అయిన సినిమాలు మాత్రం శ్రీకాంత్ లోని నటుడిని బయటికి తీసుకొచ్చాయి. ఎలాంటి ఎమోషన్ అయినా కూడా ఈయన ఫేస్‌లో చాలా అద్భుతంగా పలుకుతుంది.   
 
శ్రీకాంత్ 100వ సినిమా మహాత్మా తన ప్రాణ స్నేహితుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో నటించాడు. మహాత్మ కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా శ్రీకాంత్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు శ్రీకాంత్. తన 100వ సినిమాను తానే నిర్మించాడు కూడా. సినిమాలే కాకుండా బిజినెస్‌లోనూ శ్రీకాంత్ సత్తా చూపిస్తున్నాడు.   
 
హీరోగా మార్కెట్ లేదు అని తెలిసిన మరుక్షణం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు శ్రీకాంత్. ఈయన హీరోగా ఎంతో బిజీగా ఉన్న సమయంలో కూడా సంక్రాంతి, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాలలో వెంకటేష్, చిరంజీవి లాంటి హీరోలతో కలిసి నటించాడు శ్రీకాంత్. బాలయ్యతో శ్రీరామరాజ్యం సినిమాలో లక్ష్మణుడి పాత్రను అద్భుతంగా నటించాడు. ఆయన కెరీర్లో ఎన్నో చెప్పుకోదగ్గ పాత్రలు ఉన్నాయి.  
 
వివాదాలకు చాలా దూరంగా ఉండే శ్రీకాంత్.. ఇండస్ట్రీలో అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. మా అసోసియేషన్ లో కూడా చురుకైన పాత్ర పోషిస్తుంటాడు. ఆయన వ్యక్తిగత విషయానికొస్తే హీరోయిన్ ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరు అప్పట్లో ఆమెతో పాటు మరి కొన్ని సినిమాలు చేశారు. అదే సమయంలో ప్రేమలో పడిన శ్రీకాంత్, ఊహ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.  
 
శ్రీకాంత్ పెద్ద కుమారుడు రోషన్ నిర్మల కాన్వెంట్ సినిమాతో ఇప్పటికే హీరో అయ్యాడు. ఇప్పుడు పెళ్లి సందడి సినిమాతో వస్తున్నాడు రోషన్. ఇలాగే ఇంకా అద్భుతంగా కొనసాగాలని శ్రీకాంత్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ స్టార్ హీరోకు మన కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పేద్దాం. హ్యాపీ బర్త్ డే శ్రీకాంత్ గారూ..