'బుట్టబొమ్మ' పాట ప్రపంచ రికార్డు... ఎలా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రానికి సంగీతం థమన్. ఈయన స్వరపరచిన బాణీలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా 'సామజవరగమన', 'రాములో రాములా', 'ఓ మై గాడ్ డాడీ', 'బుట్ట బొమ్మ' పాటలు సినిమా రిలీజ్‌కి ముందే ఓ ఊపు ఊపాయి. అయితే 'బుట్ట బొమ్మ' సాంగ్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపడం విశేషం.
బుట్టబొమ్మ అంటూ సాగే ఈ పాటను అర్మాన్ మాలిక్ ఆలపించాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా తమన్ స్వరాలు సమకూర్చారు. ఇది యువతను బాగా ఆకట్టుకుంటుంది.
'అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే.. గాజుల చేతులు జాపి దగ్గరికొచ్చిన నవ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేశావు' అనే చరణం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈ పాటకు సంబంధించిన కొరియోగ్రఫీకి కూడా యూత్ ఫుల్ ఫిదా అయ్యారు. మనదేశంలోనే కాక విదేశాలలోను బుట్టబొమ్మ సాంగ్‌కి తెగ డ్యాన్స్‌లు చేస్తున్నారు.
అలాంటి బుట్టబొమ్మ పాట ఇపుడు ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు థమన్ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇంగ్లీష్ డైలీలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేసిన థమన్.. 'వరల్డ్ వైడ్‌గా అత్యంత ప్రాచుర్యం పొందిన 100 వీడియో సాంగ్స్‌లో ఈ పాట 15వ స్థానంలో నిలిచింది. మరోసారి బుట్టబొమ్మ సంచలనం' అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఈ విజయం వెనుక అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఉన్నారని, వారే తనకు ఈ శక్తినిచ్చారని థమన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండు నెలల క్రితం బుట్టబొమ్మ సాంగ్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా ప్రస్తుతం ఈ సాంగ్ 150 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాబట్టిన సంగతి తెలిసిందే.