సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: బుధవారం, 22 ఆగస్టు 2018 (19:30 IST)

బిగ్ బాస్ ఇంట్లో పెళ్ళి సందడి... యాంకర్ అనసూయ వచ్చేసింది...

ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ వుండే బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు… వాణిజ్య ప్రకటనల పుణ్యమా అని తరచూ కొన్ని ఆహ్లాదకరమైన టాస్క్‌లు లభిస్తున్నాయి. మంగళవారం రాత్రి బిగ్‌బాస్‌ ఇంట్లో పెళ్లి సందడి మొదలయింది. కెఎల్‌ఎం షాపింగ్‌ మాల్స్‌ ప్రచారం కోసం ‘పెళ్లి సందడ

ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ వుండే బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు… వాణిజ్య ప్రకటనల పుణ్యమా అని తరచూ కొన్ని ఆహ్లాదకరమైన టాస్క్‌లు లభిస్తున్నాయి. మంగళవారం రాత్రి బిగ్‌బాస్‌ ఇంట్లో పెళ్లి సందడి మొదలయింది. కెఎల్‌ఎం షాపింగ్‌ మాల్స్‌ ప్రచారం కోసం ‘పెళ్లి సందడి’ టాస్క్‌ రూపొందించారు. ఇంట్లో రెండు రోజుల పాటు పెళ్లి తంతు నిర్వహించాలని బిగ్‌బాస్‌ ఆదేశించారు. ఈ పెళ్లి కోసం కెఎల్‌ఎం షాపింగ్‌ మాల్‌ నుంచి కొత్త దుస్తులు కూడా పంపించారు. పెళ్లి కూతరు, పెళ్లి కొడుకు పంపించారు. మెహంది, సంగీత్‌, పెళ్లి అలా అన్నీ ఫంక్షన్లు నిర్వహించాలని చెప్పారు.
 
అమిత్‌, గీతా మాధురి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులుగా, తనిష్‌ పెళ్లికుమార్తె అన్నయ్యగా నటించాలని చెప్పారు. కౌశల్‌, దీప్తి పెళ్లి కుమారునికి అన్న వదినల్లాగా నటించాలని సూచించారు. గణేష్‌ పురోహితుడి పాత్ర పోషించాలి. మిగతా వారు అటు పెళ్లి కుమారుడు, ఇటు పెళ్లి కుమార్తె ఇంటి సభ్యులుగా, స్నేహితులుగా పాత్రలు పోషించాలి. పెళ్లి కళ ఉట్టుపడేలా బిగ్‌బాస్‌ ఇంటిని అందంగా అలంకరించారు. ముందుగా ఈత కొలనులో దాచి పెట్టిన 50 ఉంగరాలను వెతికి తీయమని పెళ్లి కుమార్తె ఇంటి సభ్యులకు టాస్క్‌ ఇచ్చారు. 
 
ఇంటిలో పలుచోట్ల దాచిపెట్టిన పెళ్లి బూట్లను కని పెట్టాల్సిందిగా పెళ్లి కుమారుని ఇంటి సభ్యులకు టాస్క్‌ ఇచ్చారు. లడ్డూ బూందీ పంపించి, దానితో వంద లడ్డూలు తయారు చేయాల్సిందిగా అమిత్‌ అండ్‌ గీతా మాధురి కుటుంబానికి మరో టాస్క్‌ ఇచ్చారు. కొన్ని వస్త్రాలను ఇచ్చి వాటికి డిజైన్లతో అలంకరించమని కౌశల్‌ అండ్‌ దీప్తి కుటుంబాన్ని పురమాయించారు. రెండు జట్లు సరదాగా ఈ టాస్క్‌లను పూర్తి చేశాయి. లడ్డూలు తయారుచేస్తూ నోరూరడంతో ఒక లడ్డూ తీసుకుని, టేబుల్‌ కింద దాక్కుని, ఆరగించారు అమిత్‌. ఈ పెళ్లి సందడిలో పాలుపంచుకునేందుకు యాంకర్‌ అనసూయ బిగ్‌బాస్‌ ఇంటిలోకి ప్రవేశించారు. 
 
ఆమె పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యుల వైపు చేరారు. మెహందీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చానని అనసూయ చెప్పారు. బుధవారం నాటి ఎపిసోడ్‌ మరింత ఉత్సాహంగా, ఆట పాటలతో సాగనుంది. ఇదిలావుండగా…. బిగ్‌బాస్‌ షోను వాణిజ్య ప్రకటనలను ప్రమోట్‌ చేయడానికి ఉపయోగపడే ఒక వేదికగా మార్చేస్తున్నారు. మొదటి సీజన్‌లో ఇంతగా యాడ్స్‌ ప్రమోషన్‌ గోల లేదు. మొన్ననే తన సినిమా ప్రమోషన్‌ కోసం విజయ్‌ దేవరకొండ షోలోకి వచ్చారు. 
 
అంతకు మునుపు విశ్వరూపం-2 చిత్ర ప్రమోషన్‌ కోసం కమల్‌ హాసన్‌ బిగ్‌బాస్‌ ఇంటిలోకి వెళ్లారు. దానికి మునుపు మంచు లక్ష్మి వెళ్లారు. యాంకర్‌ ప్రదీప్‌ ఒకసారి వెళ్లివచ్చారు. మొదట్లోనే…. ఇంకో హీరో కూడా లోనికి వెళ్లారు. ఇటీవల కొన్ని వినియోగ వస్తువుల ప్రమోషన్‌ కోసమే అన్నట్లు టాస్క్‌లు నిర్వహించారు. ఏం చేద్దాం… బిగ్‌బాస్‌ అయినా, ఇంకో బాస్‌ అయినా… డబ్బుల కోసమే కదా! షో మధ్యలో వాణిజ్య ప్రకటనలు వేయడం సాధారణమేగానీ… షోనే యాడ్స్‌ ప్రమోషన్‌ కోసం వినియోగించడం బిగ్‌బాస్‌ షోకు ఉన్న ఒక అవకాశం. దాన్ని బిగ్‌బాస్‌ షో నిర్వాహకులు ఈసారి బాగా వాడుకుంటున్నారు.