గురువారం, 3 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 మార్చి 2025 (15:52 IST)

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

nidhi tewari
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ సెక్రటరీగా యువ ఐఎఫ్‌ఎస్ అధికారిణి నిధి తివారీ నియమితులయ్యారు. ఆమె త్వరలోనే తన బాధ్యతలను చేపట్టనున్నారు. ఆమె నియామకాన్ని కేంద్ర నియామకాల కమిటీ ఆమోదించింది. ఈ విషయాన్ని డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం అధికారికంగా ప్రకటించింది. 
 
వారణాసిలోని మెహముర్‌గంజ్‌కు చెందిన నిధి తివారీ.. సివిల్ సర్వీసెస్‌ పరీక్షల్లో 96వ ర్యాంకును సాధించారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఈమె గతంలో వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (వాణిజ్య పన్నులు)గా పని చేస్తున్నారు. 2023 జనవరి 6 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తొలుత 2022లో ఆమె అండర్ సెక్రటరీగా చేరారు. 
 
పీఎంవోలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పని చేశారు. ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో బాధ్యతలు నిర్వహించారు. అంతర్జాతీయ సంబంధాల మెరుగుదలలో ఆమెకు ఉన్న నైపుణ్యమే పీఎంవోలో కీలక పోషించే స్థాయికి తీసుకొచ్చింది. 
 
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవాల్‌కు విదేశీ వ్యవహారాలు, భద్రత వంటి అంశాలను నేరుగా ఆయనకు నివేదించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం డిప్యూటీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న నిధి.. కొత్త బాధ్యతలను త్వరలో చేపట్టనున్నారు.