వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీసు స్టేషను పరిధిలో ఆదివారం అర్థరాత్రి ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. తనను చంపేస్తున్నాడంటూ పోలీసులకు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లే లోపుగానే అతడు కత్తిపోట్లకు గురై మృత్యువాత పడ్డాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పులిమామిడి గ్రామానికి చెందిన 47 ఏళ్ల బచ్చు వెంకటేశ్వర్లు కర్మన్ ఘాట్‌లోని జానకి ఎంక్లేవ్‌లో నివాసం వుంటున్నాడు. మనస్పర్థలు కారణంగా భార్య అతడి నుంచి దూరంగా వుంటోంది.
దినసరి వడ్డీలకు డబ్బులిస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేసే వెంకటేశ్వర్లు అదే ప్రాంతానికి చెందిన గురవమ్మకి దగ్గరయ్యాడు. ఈమెకి ఇద్దరు పిల్లలు. గురవమ్మను చేరదీసిన వెంకటేశ్వర్లు ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఐతే గురవమ్మ తన ఇద్దరు పిల్లల్ని మరోచోట వుంచి అప్పుడప్పుడు వారివద్దకు వెళ్తూ వస్తోంది. ఆదివారం నాడు ఉగాది పండుగ సందర్భంగా ఇద్దరు పిల్లల్ని కర్మన్ ఘాట్ జానకి ఎంక్లేవ్‌కి తీసుకుని వచ్చింది. ఈ క్రమంలో ఆ ఇద్దరు పిల్లల్ని, గురవమ్మను వెంకటేశ్వర్లు బూతులు తిట్టడం ప్రారంభించాడు. తన సొమ్మంతా తింటున్నారంటూ పిల్లల్ని దూషించాడు. దీన్ని తట్టుకోలేని పవన్ ఆయనపై దాడికి దిగాడు.
వెంకటేశ్వర్లు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తనపై పవన్ అనే యువకుడు దాడి చేస్తున్నాడని, రక్షించాలంటూ చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చేసరికి వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడి వున్నాడు. భుజంపైన పొట్టలో కత్తిపోట్లు వున్నాయి. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.