శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (09:55 IST)

'బిగ్ బాస్ అల్టిమేట్' నుంచి తప్పుకున్న కమల్ హాసన్

విశ్వనటుడు కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 'బిగ్ బాస్ అల్టిమేట్' నుంచి ఆయన హోస్ట్‌గా తప్పుకున్నారు. 24 గంటల పాటు నిరంతరాయంగా ప్రసారమయ్యేలా బిగ్ బాస్ అల్టిమేట్ పేరుతో హాట్‌ స్టార్‌లో ఇది ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ ఆదివారం అధికారికంగా వెల్లడించారు.
 
అయితే, ఈయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం లేకపోలేదు. యువ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై 'విక్రమ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వివిధ కారణాల రీత్యా ఆలస్యమవుతూ వస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ షెడ్యూల్ జరుపుకుంటుంది. 
 
పైగా, ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు వీలుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విక్రమ్ షూటింగ్, బిగ్ బాస్ షెడ్యూళ్ళ మధ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇది కేవలం బ్రేక్ మాత్రమేనని, బిగ్ బాస్ సీజన్-6లో మళ్లీ అందర్నీ కలుస్తానని కమల్ హాసన్ ప్రకటించారు.