బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా... మా మీద పడి ఏడుస్తారేంటి : చిరంజీవి

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవికి కోపం వచ్చింది. పలువురు రాజకీయ నేతలు చిత్రపరిశ్రమను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుండటం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. అలాంటి వారిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగ చిత్ర పరిశ్రమపైపడి ఏడుస్తారెందుకు అంటూ ఘాటుగా విమర్శించారు. 
 
బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. రవితేజ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందమంతా వేడుక చేసుకుంది. ఇందులో చిరంజీవి మాట్లాడుతూ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
గతకొన్నేళ్లుగా సినీ పరిశ్రమను చుట్టుముడుతున్న కొన్ని రాజకీయాంశాలపై చిరంజీవి మాట్లాడారు. 'మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి..' అని చురకలు అంటించారు. 
 
అలాగే 'వాల్తేరు వీరయ్య' చిత్ర విజయం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. 'ఒకప్పుడు.. సినిమాలు 100, 175, 200 రోజులు ఆడేవి. ఇప్పుడు.. రెండు వారాలే ఆడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' 200 రోజులు ప్రదర్శిచడం ఆనందంగా ఉంది. అత్యధిక రోజులు సినిమా ప్రదర్శితమై, విజయానికి గుర్తుగా షీల్డు అందుకున్నందుకు ఒళ్లు పులకరిస్తోంది. చరిత్రను తిరగరాసినట్టు అనిపిస్తోంది' అని అన్నారు.