బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (10:25 IST)

అభిమానుల కోసం నా వ్యక్తిత్వాన్ని నడవడికని మార్చుకుంటూ వచ్చా : మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi, Maker Mehr Ramesh, Tamannaah Bhatia, Keerthy Suresh, Sushant
Chiranjeevi, Maker Mehr Ramesh, Tamannaah Bhatia, Keerthy Suresh, Sushant
మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్‌'. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వుంది. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. 
 
ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అమ్మ ప్రేమ ఏనాటికి పాతదవదు బోర్ కొట్టదు. అలాగే అభిమానులు చూపించిన ప్రేమ కేరింతలు ఎప్పుడు విన్నా ఫ్రెష్ గా వుంటుంది. ఎప్పుడు చెవినపడ్డా హృదయాన్ని కదిలిస్తుంది.  భగవంతుడు నాకు ఇలాంటి జన్మ ఇచ్చినందుకు సర్వాద కృతజ్ఞుడినై వుంటాను. అభిమానులు గర్వపడేలా వుండాలని అభిమానుల కోసం నా వ్యక్తిత్వాన్ని నడవడికని మార్చుకుంటూ వచ్చాను, ఇంతమందికి స్ఫూర్తిదాయకంగా వున్న నేను ఆచితూచి అడుగులు వేయాలని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ‘మా అన్నయ్య’ అని మీరంతా గర్వంగా చెప్పుకునేలా ఈ స్థాయికి వచ్చాను. ఖైదీ నెంబర్ 150లో నాకు నచ్చితేనే చేస్తాను, నాకు నచ్చితేనే చూస్తాను’ అనే  డైలాగ్ వుంది. భోళా శంకర్ నాకు నచ్చింది కాబట్టే చేశాను. నాకు నచ్చింది కాబట్టే చూశాను. అంతగా నచ్చిన సినిమా మీ అందరి చేత మార్కులు వేయించుకుంటుదనే ధైర్యంతోనే ఆగస్ట్11న సినిమాని మీ ముందుకు రాబోతుంది. మంచి కంటెంట్ వున్నపుడు రీమేక్ చేయడంలో తప్పులేదు. వేదాళం మంచి సినిమా. ఓటీటీ వేదికలపై ఎక్కడా లేదు. ఎవరూ చూసివుండరు. అలాంటి మంచి కంటెంట్ ప్రేక్షకులకు చూపించాలానే ఉద్దేశంతో భోళా శంకర్ చేశాం.

ఈ సినిమా షూటింగ్ చాలా ఉత్సాహంగా గడిచింది. ఇంత ఉత్సాహం ఎందుకంటే.. ఈ సినిమా ఆల్రెడీ మా మనసుల్లో  సూపర్ హిట్ అయిపోయిందనే ఫీలింగ్ వచ్చేసింది. మెహర్ రమేష్ మా కుటుంబ సభ్యుడు. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ పెరిగాడు. తనకి దర్శకుడు కావాలనే కోరిక కూడా నన్ను చూసే కలిగింది. ఐతే దర్శకుడిగా మాత్రం తన స్వయంకృషి తోనే ఎదగాలని కష్టపడ్డాడు. మొన్న బ్రో వేడుకలో కళ్యాణ్ బాబు చెప్పినట్లు ఇండస్ట్రీ అనేది ఒకరిసొత్తు కాదు. ఇది అందరిది. ప్రతిభని ప్రోత్సహించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రతిభని ప్రోత్సహించడం నా భాద్యత. కొత్తరక్తం వస్తేనే కొత్త ఎనర్జీ వస్తుంది. ఇండస్ట్రీ అక్షయ పాత్ర లాంటింది. ఎంతమంది వచ్చినా సరే అన్నం పెడుతుంది. కేవలం స్టార్స్ మాత్రమే వుండే ఇండస్ట్రీలో ఇక్కడ రాణిస్తాననే గట్టి నమ్మకంతో వచ్చాను.

మొదట్లో చిన్న వేషాలు చేసినప్పటికీ  నా ప్రతిభపై నమ్మకం వుంది. కొత్త అల్లుడు, కొత్తపేట రౌడీ చిత్రాలలో నావి చిన్న పాత్రలే. ఐతే అవి చేయనంటే నా భవిష్యత్ ప్రభావం పడుతుందనే భయంతోనే వాటిని చేశాను. అయితే  ఈ ఇండస్ట్రీ నన్ను ఆదరించింది ప్రోత్సహించిందనే కంటే నన్ను ప్రోత్సహించి భూజనకెత్తుకుంది ప్రేక్షకులు. ఇది సత్యం. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థే వుండేది. నవయుగ, పూర్ణ, లక్ష్మీ,, ఇలాంటి సంస్థలు వున్నాయి. వాళ్ళు ఓకే అంటేనే డబ్బులు ఇస్తేనే నిర్మాతలు సినిమా తీసేవారు. అలాంటి సంస్థ నుంచి వచ్చిన ఒక వ్యక్తి నాతో సినిమా చేయాలని ఆసక్తి చూపారు. డ్యాన్సులు బాగా చేస్తున్నాడు, ఫైట్స్ చేస్తున్నారు, అతను వుంటే ప్రేక్షకులు వస్తున్నారు. అతనితో సినిమా ఎందుకు తీయకూడదని అన్నారు. ప్రేక్షకుల నుంచి ఆదరణ వస్తుంది కాబట్టి నిర్మాతలు నాకు హీరోగా అవకాశాలు ఇస్తూ కమర్షియల్ హీరోగా చేశారు. అందుకే నా జీవితంలో ముందుగా కృతజ్ఞతలు వుండేది నన్ను ఆదరించిన ప్రేక్షకులపైనే. నా ప్రతిభని గుర్తించిన ప్రేక్షకులే లేకుంటే నేను ఈ స్థాయిలో ఉండేవాడని కాదు. అందుకే నేను ఏది చేసిన ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారనేదానిపైనే నా ద్రుష్టి వుంటుంది. నన్ను ఆదరించింది చేయూత నిచ్చింది ప్రేక్షకులు, ఆ తర్వాత పరిశ్రమ. ఎవరు ముందు ఇచ్చిన నాకు సర్వాద కృతజ్ఞత వుంటుంది. మిల్కీబ్యూటీ పాటలో ఇంత యంగ్ గా ఎలా కనిపిస్తున్నారని అడుగుతున్నారు.

ఇది అభిమానులు ఇచ్చిన ఎనర్జీ. ఇది నా గుండెలోపలి నుంచి వచ్చే మాట. దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాకి పూర్తి స్థాయి న్యాయం చేశాడు. ఇండస్ట్రీలో మరో తమ్ముడని గర్వించేలా ఈ సినిమా విజయం ద్వారా మీ ఆశీస్సులు కూడా పొందుతారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ప్రాణం పెట్టి ఫైట్స్ డిజైన్ చేశారు. డడ్లీ అద్భుతమైన పని తీరు కనబరిచారు. చాలా అందంగా చూపించారు. తనతో మళ్ళీ వర్క్ చేయాలనీ వుంది. పాత్ర నిడివి ఎంత ఉన్నా సరే నటిస్తానంటూ ముందుకొచ్చిన సుశాంత్‌కు థ్యాంక్స్‌. నాతో డ్యాన్స్ చేసినప్పుడు ఒకవైపు టెన్షన్ మరో వైపు ఎక్సయిట్ మెంట్ తో వున్నాడు. తన హుషారు తెరపై చూస్తారు.  ఆది, గెటప్ శీను, లోబో, వేణు , బిత్తిరి సత్తి  ఇలా ఎంతోమంది నటీ నటులతో సెట్స్ లో సందడిగా వుండేది. ఇందులో శ్రీముఖి తో కొన్ని సన్నివేశాలు వుంటాయి, అందులో నేను కాదు కళ్యాణ్ బాబు గుర్తుకువస్తారు ( నవ్వుతూ).
తమన్నా ఇందులో మాస్ కామెడీ పాత్ర చేసింది. తన పాత్ర చాలా బావుంటుంది. కీర్తి సురేష్ మహానటి. మా ఇంట్లో బిడ్డల అనిపిస్తుంది. మేమిద్దరం ఇందులో అన్నాచెల్లెలుగా నటించాం. అది సినిమా వరకే పరిమితంకావాలని, బయట అన్నయ్య అని పిలవొద్దని చెప్పా (నవ్వుతూ). మహానటి చిత్రంలోని కీర్తి నటన చూశాక నాకు మాటలు రాలేదు. మీ అమ్మాయికి జాతీయ అవార్డ్ వస్తుందని వాళ్ళ అమ్మగారితో చెప్పాను.  నా వాక్కు నిజమైంది. భోళా శంకర్ లో మా ఇద్దరి సీన్స్ పండుతాయి. మణిశర్మ గారి అబ్బాయి మహతి స్వరసాగర్‌ అద్భుతమైన సంగీతం అందించాడు. అన్ని రకాల పాటలు ఇచ్చారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు. ఆర్ట్ డైరెక్టర్‌ ఎ.ఎస్‌. ప్రకాశ్‌ టాలెంట్‌ తో కట్టిపడేశారు. ఈ సినిమాలో అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేశారు. ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌ ఇంకా పనిలో నిమగ్నమై ఉన్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ అన్ని పాటలకు మంచి డ్యాన్స్ మూమెంట్స్ కంపోజ్ చేశారు.

నిర్మాత అనిల్ సుంకర గారి  తండ్రి  రామ్ బ్రహ్మం సుంకర.  ఆయన పేరు వేస్తే ఆయన ఆశీస్సులు ఉన్నట్లే. అనిల్ గారికి సినిమా అంటే ప్యాషన్. ఆయనకికి డబ్బు కంటే విజయం ముఖ్యం. ఇటివలే సామజవరగమన అనే చిన్న సినిమాతో పెద్ద విజయం సాధించారు. ఆయన మొహంలో నవ్వు చూస్తుంటే భోళా విజయం సాధిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మీ అందరి ఆశీస్సులలతో భోళా శంకర్ తప్పకుండా హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పని చేసిన నటినటులకు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో భోళా శంకర్ నాకు ‘వాల్తేరు వీరయ్య’ కు మించిన హిట్ అవుతుందని ఆకాంక్షిస్తున్నాను’’ అని అన్నారు