ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (16:19 IST)

కైకాల ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్న చిరంజీవి - వై.ఎస్‌. జ‌గ‌న్ వాక‌బు - పేర్నినాని ప‌లుక‌రింపు

chiru- YS jagan
టాలీవుడ్ లెజండ్రీ నటుడు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కైకాల సత్యనారాయణ అనారోగ్య కారణాలతో అపోలో హాస్పిటల్ లో చేరిన సమయం నుంచి మెగాస్టార్ చిరంజీవి అపోలో హాస్పిటల్ వైద్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రతిరోజూ రెండు పూటలా ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన స్పృహలో ఉన్నారా? లేదా? ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే ఆయన మరింత త్వరగా కోలుకునే అవకాశం ఉంది? వంటి అవకాశాల గురించి డాక్టర్ లతో సంప్రదింపులు జరుపుతున్నారు. 
 
కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తాను మాట్లాడిన తర్వాత థమ్సప్ చూపించారని కూడా ముందుగా చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కైకాల సత్యనారాయణ కుటుంబానికి అన్ని తానే అపోలో హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడుతూ కైకాల కుటుంబ సభ్యులకు చిరంజీవి ధైర్యం చెబుతున్నారు. అలాగే టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా ఎప్పటికప్పుడు కైకాల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కష్ట సమయంలో తమకు ఇంతలా ఒక అండగా నిలబడి చిరంజీవికి కైకాల కుటుంబ సభ్యులు ఋణపడి ఉంటారంటున్నారు. అలాగే టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు కూడా చినబాబుకు ఫోన్ చేసి కైకాల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. 
 
కైకాల కుమారుడికి జగన్ ఫోన్ 
మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కైకాల సత్యనారాయణ చిన్న కుమారుడు, కేజిఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చిన్నబాబు)కు ఫోన్ చేసి కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? అనే విషయాన్ని అడిగి తెలుసుకున్న జగన్, ప్రభుత్వం తరఫున ఏమైనా సహాయం కావాలంటే అడగాలని ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ధైర్యం చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక ఐఏఎస్ అధికారి వచ్చి కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని వాకబు చేయనున్నారు. 
 
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మచిలీపట్నం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పేర్ని నాని కూడా అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే చిన్న బాబుతో సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు రావు రమేష్ కైకాల ఆరోగ్యం గురించి ఫోన్ చేసి వాకబు చేయగా కన్నడ సూపర్ స్టార్ యష్, మరో స్టార్ శివ రాజ్ కుమార్ కూడా చినబాబుకు ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేసి, ఆయనకు ఏమీ కాదని, మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పారు. ఇక కైకాల ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఎలాంటి ఇబ్బంది లేదని, దయచేసి పుకార్లు సృష్టించి ప్రజలను, కైకాల అభిమానులను ఆందోళనకు గురి చేయవద్దని కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.