ఆపద్బాంధవుడికీ అభినందనల వెల్లువ.. (video)
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతి ఇచ్చాను..అనే శ్రీశ్రీగారి పాటతో కూడిన చిన్న వీడియో బైట్‌ను అఖిల భారత చిరంజీవి యువత విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఆక్సిజన్ సిలెండర్లను, క్యూరెట్లరు ఆంధ్ర ప్రాంతంలోనూ, ఇతర చోట్ల పంపిణీ చేసిన సందర్భంగా వారు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.
వాయు పుత్రుడు హనుమంతుని అంశతో "చిరంజీవి" గా తన ప్రస్థానం ప్రారంభించిన మెగాస్టార్ ఇప్పుడు ప్రాణార్తులకు సంజీవని వంటి "ఆక్సిజెన్" అందిస్తూ సార్ధక నామధేయుడయ్యారు. ప్రాణాంతక కరోనా సోకి ఊపిరి ఆగిపోతున్న బాధితులను చూసి చలించిపోయిన చిరంజీవి వెంటనే రంగంలోకి దిగి జిల్లాకో ఆక్సిజెన్ బ్యాంకును ఏర్పాటు చేసి ప్రాణవాయువు అందించే కార్యాచరణ ప్రారంభించారు.
ఆక్సిజెన్ అందక అవస్థలు పడుతున్న కరోనా బాధితులకు నిజంగా ఇది వరంగా మారింది. చిరంజీవి ప్రాణవాయువు అందించి తమనీ చిరంజీవులను చేసారని కరోనా బాధితులు కృతఙ్ఞతలు తెలియజేస్తుండగా పలువురు ముక్తకంఠంతో చిరంజీవి ఆక్సిజెన్ బ్యాంకును అభినందిస్తున్నారు.
ఇకపోతే.. కరోనా క్రైసిస్ చారిటీ సేవల అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల నిర్మాణం వంటి మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా అలాగే తెలంగాణాలోని మరికొన్ని జిల్లాలకు ఆయన ఆక్సిజన్ సిలిండర్లు పంపారు.
తాజాగా ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు. అలాగే తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఈ మిషన్‌లో భాగమైన అందరికి, ప్రాణాలను కాపాడటానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.' అంటూ ఆయన ట్వీట్ చేశారు.