కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి
కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులను ఏరిపారేయాలనే ఉద్దేశంలో భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్ వైపు జరిగినట్టు తెలుస్తోంది.
ఆ ప్రాంతంలో ఇంకా చాలా మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో దాదాపు 8000 మంది భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా మావోయిస్టులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ములుగు జిల్లాలోని కర్రెగుట్ట ప్రాంతంలో గత ఐదు రోజులుగా కూబింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్‌లో తాజాగా 28 మంది మావోయిస్టులు మృతి చెందారు.
అయితే భద్రత బలగాల ఆపరేషన్‌తో బెదిరిపోయిన మావోయిస్టులు.. కర్రెగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపేయాలని మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో ఓ లేఖ రాశారు.
శాంతి చర్చలకు ముందుకు రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. చర్చలకు తాము సిద్ధంగా వున్నట్లు తెలిపారు.