ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (23:28 IST)

కేజీఎఫ్ ఛాప్టర్ 2- ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్.. కళ్లు గిరగిరా తిరగడం..?

కేజీఎఫ్ ఛాప్టర్ 2పై ప్రస్తుతం భారీ అంచనాలున్నాయి. కేజీఎఫ్ సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. దాంతో రెండో భాగం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు అభిమానులు. మధ్యలో కరోనా వచ్చింది కానీ లేదంటే మాత్రం గతేడాదే సినిమా విడుదలై ఉండేది. ఇంతకీ సంగతేంటంటే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఆకాశంలో ఉంది. 
 
నిర్మాతలు చెప్తున్న రేట్స్ విన్న తర్వాత బయ్యర్లకు వణుకు పుడుతుందని తెలుస్తుంది. కాస్త అతిగానే రేట్స్ కోట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. తెలుగులో ఈ సినిమా రైట్స్ కోసం ఏఖంగా 70 కోట్లు కోట్ చేస్తున్నారని ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. తెలుగులో 70 కోట్లు అనేది చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద హీరోల సినిమాలకు ఆ స్థాయిలో ఇక్కడ బిజినెస్ జరుగుతుంటుంది. 
 
టాలీవుడ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు ఇప్పుడు ఈ స్థాయి బిజినెస్ చేస్తున్నారు. అలాంటి రేట్ ఇప్పుడు కెజియఫ్ 2 కోసం చెప్పడంతో డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు. అయినా కూడా ఈ సినిమాపై ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని సినిమాను 66 కోట్లకు దిల్ రాజు హక్కులను సొంతం చేసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. తొలిభాగం కేవలం 5 కోట్లు మాత్రమే అమ్ముడైంది. అలాంటిది రెండో భాగం దాని కంటే 11 రెట్లు ఎక్కువ పలుకుతుంది. మరోవైపు కన్నడలో 100 కోట్లలో బిజినెస్ జరుగుతుంది.
 
ఇక తమిళంలో 30 కోట్ల వరకు జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. ఇక ఓవర్సీస్‌లో అయితే 80 కోట్ల వరకు కోట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా కేజీఎఫ్ ఛాప్టర్ 2 రూ.240 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కాగా జూలైలో కేజీఎఫ్ 2 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.