ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (18:18 IST)

పవన్ కల్యాణ్ కు ద్వారంపూడి బెదిరింపు తప్పు, చర్చి స్థలాన్నివైసిపి ఆక్రమించింది : నిర్మాత నట్టి కుమార్ ఫైర్

Dwarampudi, Pawan Kalyan, Natti Kumar
Dwarampudi, Pawan Kalyan, Natti Kumar
ఏ  పార్టీల వారైనా  ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమని, అయితే  వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి విమర్శలు చేయడం ఎవరికీ మంచిది కాదని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ హితవు పలికారు. బుధవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ నాయకులు ఎక్కడికి మీటింగు లకు వెళ్లినా, అక్కడి లోకల్ సమస్యల గురించి మాట్లాడటం సహజం. దానిని బేస్ చేసుకుని  కాకినాడలో పవన్ కల్యాణ్ ను బ్యానర్ కట్టనివ్వం. అడుగు పెట్టనివ్వం అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనడం కరెక్ట్ కాదు. 
 
కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ లో ఉందా? ఇంక ఎక్కడైనా ఉందా? అని అనిపిస్తోంది. ద్వారంపూడి మాటలు వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయి. అంతే కాదు పవన్ కల్యాణ్ డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపణలు చేయడం కూడా ద్వారంపూడికి తగదు. సినిమా పరిశ్రమలో దాదాపు 35 ఏళ్లుగా ఉన్న మాకు ఎవరు ఎలాంటివారో తెలుసు. సాయం చేయడం తప్ప పవన్ కల్యాణ్ కు అలాంటివి తెలియవు. ఎవరో ఎదో చెప్పారని ద్వారంపూడి ఆరోపించారా? లేక కావాలని ఆరోపించారో తెలియదు కానీ వాటిని ద్వారంపూడి నిరూపించాలి. పార్టీ పరంగా ఎన్ని విమర్శలైనా ఒకరినొకరు చేసుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా పవన్ ను అనడం నాకు ఎంతో బాధ కలిగించింది. ఇక పవన్, ద్వారంపూడి మధ్య మాటల యుద్ధంలో ముద్రగడ పద్మనాభం ఎందుకు ఎంటర్ అయ్యారో అర్ధం కావడం లేదు. 
 
ముద్రగడ అనగానే 1991వ సంవత్సరం నుంచి ఒక కాపు ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితం. ఆయనను కాపు ఉద్యమ నేతగానే అందరూ చూస్తారు. అయితే ముద్రగడ  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడితే ఫర్వాలేదు కానీ  ఒక కాపు ఉద్యమ నేతగా పవన్ ను విమర్శించడం ఎంతమాత్రం తగదు. మేము ముద్రగడను ఓ పెద్దమనిషిగా గౌరవిస్తాం. ఇది ఆయన తెలుసుకోవాలి. వాస్తవానికి కాపులను బీసీలలో చేర్చాలని 1991లో ముద్రగడ చేపట్టిన కాపు ఉద్యమంలో అప్పట్లో యువకుడిగా ఉన్న నేను కీలకంగా పాల్గొన్నాను. నాడు ఆయన చేపట్టిన ఉద్యమం మొదలు నేటి వరకు ఆయన చేపట్టిన ఉద్యమాలు ఏవీ సక్సిస్ కాలేదు. కాపులు ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీకి చెందిన వారైనా నేను స్వాగతిస్తాను. ముద్రగడ ఓ కాపు నాయకుడు అయివుండి, పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శించడం ఎంతమాత్రం సబబు కాదు. దీనిపై ఇంకా లోతులలోకి వెళ్లదలచుకోలేదు. దీనిని ముద్రగడ విజ్ఞతకే  వదిలి వేస్తున్నాను. అయినా పవన్ కల్యాణ్ తన మాటలలో తనను అన్ని కులాల వాళ్ళు అభిమానిస్తారు. అందువల్ల తాను  అందరివాడినని అంటున్నారు. 2009లో చిరంజీవికి నష్టం కలిగించేలా కుల ప్రస్తావనను కొన్ని శక్తులు తీసుకుని వచ్చాయి. కొన్ని కారణాల వల్ల 2014లో పవన్ గెలవకపోయినా, ఇప్పడు అన్నింటినీ విశ్లేషించుకుని  పవన్ ముందుకు వెళుతున్నారు.
 
విశాఖపట్నంలో చర్చి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారు
 
విశాఖపట్నం నడి బొడ్డున కోట్లాది రూపాయల  సి బి ఎన్ .సి చర్చి స్థలాన్ని ఆక్రమించుకుని మరీ అక్కడ బిజినెస్ కాంప్లెక్స్ లు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని 2021వ సంవత్సరంలోనే ఏపీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అమిత్ షా వంటి పలువురికి లెటర్స్ రూపంలో పిర్యాదు చేయడం జరిగిందని, అయినా అధికారుల అండదండలతో స్థానిక ఎంపీ ఎం.వి.వి. రెండువేల కోట్లతో కట్టబోతున్నారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకుని చర్చి స్థలాన్ని చర్చికే అప్పగించాలి" అని  నట్టి కుమార్ ఇదే ప్రెస్ మీట్లో డిమాండ్ చేశారు.
 
చిన్న సినిమాలకు 5 షో ఇవ్వాలి
చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలే ఎక్కువగా నిర్మాణమవుతాయి . వేలాది మంది కార్మికులు చిన్న సినిమాలపైనే ఆధారపడి జీవిస్తుంటారు. అలాంటి చిన్న సినిమాల మనుగడ  కష్టమైపోయింది. అందుకే ఏళ్ల తరబడి చిన్న సినిమాల కోసం ప్రత్యేకంగా థియేటర్స్ లో ఐదవ షో ను తప్పనిసరిగా కేటాయించాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. ఆదిపురుష సినిమాకు కోరిన వెంటనే 6 షోలు ఇచ్చారు. మేము చిన్న సినిమాల కోసం కేవలం 2-30 గంటల మాట్నీ షో మాత్రమే ఎప్పట్నుంచో అడుగుతున్నాం. దీనిని అమలులోకి తీసుకుని రావాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభ్యర్ధిస్తున్నాను అని నట్టి కుమార్ అన్నారు.
 
రాంచరణ్, ఉపాసనలకు శుభాకాంక్షలు.
మంచి వాళ్లకు మంచే జరుగుతుంది. ఎవరికైనా సాయం చేయడంలో .రాంచరణ్, ఉపాసనలు పోటీ పడుతుంటారు. వారికి పండంటి లక్ష్మీదేవి లాంటి బిడ్డ పుట్టడం ఆనందదాయకం. అంటూ వారికి  నట్టి కుమార్ శుభాకాంక్షలు. తెలిపారు.