బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 20 జూన్ 2023 (17:29 IST)

అండగా నిలవని వాడు ముస్లిం అయితే ఏంటి? హిందువు అయితే ఏంటి?

pawan kalyan
కష్టాలు, ఆపదలో ఉన్నపుడు మనకు అండగా నిలవనివాడు ముస్లిం అయితే ఏంటి? హిందువు అయితే ఏంటి? అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాను హిందువును... ముస్లింలు తనకు సోదరులు వంటివారన్నారు. తాను చేపట్టిన వారాహి విజయ యాత్రలో భాగంగా,  మంగళవారం కాకినాడ నగర ముస్లింలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను మతాన్ని, ఘర్షణలను అర్థం చేసుకుని వచ్చానని, తాను మిగతా రాజకీయ పార్టీల నేతల్లాకాకుండా ఒక సోదరుడిలా, ఒక మనిషిగా, ఒక భారతీయుడిగా మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఏ మతంలోనైనా అతివాద భావజాలాన్ని మనమంతా ఖండించాలన్నారు. 
 
నేను హిందువును, మీరు నాకు సహోదరులు వంటివారు. నేను సత్యాన్ని నమ్ముతాను. నాపై మీకు నమ్మకం ఉంటే నాకు, నా పార్టీకి అండగా ఉండండి. గత ఎన్నికల్లో మూడు ఎమ్మెల్యే స్థానాలు, మూడు ఎంపీ స్థానాలను ముస్లింలకు కేటాయించాను. ఇటీవల రంజాన్ మాసంలో మసీదు, ముస్లిం విద్యా సంస్థల అభివృద్ధి కోసం రూ.25 లక్షలు ఇచ్చాను. అధికారంలోకి వస్తే ఇంకెంత చేయగలనో అర్థం చేసుకోండి. నేను మీరు ఒకటే... నన్ను పరాయివాడిగా చూడకండి. నన్ను కూడా మీలో ఒకడిగా భావించండి. 
 
మొన్న కడపలో మైనారిటీ అమ్మాయిపై అత్యాచారం జరిగితే జనసేన స్పందించింది. కానీ, అక్కడే ఉన్న ఉప ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదు. నన్ను నమ్ముతారా?, అతడ్ని నమ్ముతారా? మనకు అండగా నిలవని వాడు ముస్లిం అయితే ఏంటి? హిందువు అయితే ఏంటి?. ఈ సారి ఎన్నికల్లో ముస్లింలు జనసేనకు మద్దతు ఇవ్వండి. మీకోసం మరింతగా పని చేస్తాను" అని పవన్ కళ్యాణ్ అన్నారు.