గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 18 జూన్ 2023 (09:47 IST)

నన్ను చంపేందుకు వైకాపా సుపారీ గ్యాంగులు రంగంలోకి దిగాయి : పవన్ కళ్యాణ్

pawan kalyan
తనను హత్య చేసేందుకు వైకాపా సుపారీ గ్యాంగులు రంగంలోకి దిగాయని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. అందువల్ల జనసైనికులు మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారం పోతుందన్న విషయాన్ని వైకాపా నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే వారు ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 
 
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తనకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు ప్రత్యేకంగా సుపారీ గ్యాంగులను రంగంలోకి దించారన్న పక్కా సమచారం ఉందని, అందువల్ల జనసేన పార్టీ నేతలు, జనసైనికులు, వీర మహిళలు ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. 
 
బలంగా ఉన్న జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికార వైకాపా పాలకలును గద్దె దించడం ఖాయమని, అందువల్ల వారు ఎంతకైనా తెగించే అవకాశం ఉందన్నారు. తనను ఎంతగా భయపెడితే తాను అంతగా రాటుదేలుతానని తేల్చి చెప్పారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే తోట చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు జనసైనికులను, వీర మహిళలపై చేసిన దాడి గురించి ప్రస్తావిస్తూ, అప్పట్లో బలమైన కార్యాచరణ లేక వెనుకడుగు వేశామని, ఇపుడు మాత్రం అలా కాదన్నారు. 
 
వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపాకు ఒక్కటికూడా రాదన్నారు. తాను సినీ హీరోను కాకాండా ఉండివుంటే ప్రజల్లోకి బలంగా చొచ్చుకుని పోయివుండేవాడినని, ఇపుడు సినీ అభిమానం అడ్డొస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.