సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 15 జూన్ 2023 (12:53 IST)

ఆనాడు మాదాపూర్‌ని హైటెక్ సిటీగా చేసిన వాళ్లం 'అమరావతి ఆల్ ఇండియా సిటీ'గా చేయలేమా?

pawan kalyan
కర్టెసి- జనసేన, ట్విట్టర్
జనసేన వారాహి విజయ యాత్రలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మాట ఇచ్చి మడమ తిప్పి ఏకంగా 200 మంది అమరావతి రైతుల ఆత్మహత్యకు కారకుడయ్యారంటూ సీఎంపై మండిపడ్డారు. ప్రభుత్వం ఒక్కసారి మాట ఇస్తే దానికి కట్టుబడి వుండాలన్నారు. ఆనాడు అమరావతి రాజధాని నిర్మాణానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని సభాముఖంగా చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, గద్దెనెక్కాక మాట మార్చారన్నారు.
 
pawan kalyan
అమరావతిని రాజధానిగా నిర్మించేందుకు ఏవేవో సాకులు చెపుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ నగరానికి దూరంగా విసిరేసినట్లు రాళ్లూరప్పలతో నిండిపోయి ఎందుకు పనికిరాదన్నట్లుగా వుండే ప్రాంతమైన మాదాపూర్‌ను హైటెక్ సిటీగా అభివృద్ధి చేసిన సంగతి సీఎంకి తెలియదేమో అని ఎద్దేవా చేసారు. 30 వేల ఎకరాలు ప్రభుత్వానికి ధారపోసిన రైతులుకున్న పట్టుదలలో రవ్వంత పట్టుదల జగన్ మోహన్ రెడ్డికి వున్నా ఇప్పటికే అమరావతి నగరం ఆల్ ఇండియా సిటీగా వెలిగిపోతూ వుండేదన్నారు.
 
pawan kalyan
తాము అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని నిర్మాణం పనులను చకచకా పూర్తి చేసి ప్రజలు ఇచ్చిన 30 ఎకరాల త్యాగానికి ప్రతిఫలాన్ని వారి చేతుల్లో పెడతామన్నారు. ప్రజలపై విద్యుత్ పన్ను, చెత్త పన్ను, ఆస్తి పన్నులను పెంచుకుంటూ నడ్డి విరుస్తూ ఆ డబ్బును కొంతమందికి పంచేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి అంటే ఇదేనా... అంటూ ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పన విషయాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయిందని విమర్శించారు. పదేళ్లుగా ప్రజల బాగు కోసం పనిచేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల కోసం నిలబడ్డామనీ, తమను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలబెడతామని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.