బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జనవరి 2020 (13:06 IST)

#పీవీ సింధుకి పద్మభూషణ్.. పద్మశ్రీ ఎవరికి.. పద్మభూషణ్ ఎవరికి.. లిస్టు ఇదో..

తెలుగుతేజం పూసర్ల వెంకట సింధుకు ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డు దక్కనుంది. కేంద్ర ప్రభుత్వం మరో అత్యున్నత పురస్కారంతో పీవీ సింధును సత్కరించనుంది. రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని శనివారం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సింధుకు.. ప్రతిష్టాత్మక 'పద్మ భూషణ్‌' లభించింది.

2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన 24 ఏళ్ల సింధు.. వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన తొలి ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గానూ రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో సింధు.. పసిడి, రెండు రజత, రెండు కాంస్య పతకాలను సాధించింది. 
 
కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఐదుగురు తెలుగువాళ్లకు పురస్కారం లభించింది. పీవీ సింధు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ అవార్డుకు ఎంపికైంది. శ్రీభాష్యం విజయసారథి (విద్య, సాహిత్యం), చిన్నతల వెంకటరెడ్డి (వ్యవసాయ రంగం)లకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. ఏపీ నుంచి ఎడ్ల గోపాలరావు (కళారంగం),  దళవాయి చలపతిరావు (కళారంగం)లను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేశారు.
 
పీవీ సింధుతో పాటు బాక్సింగ్‌ స్టార్‌ ఎంసీ మేరీకోమ్‌కు.. రెండో అత్యున్నత పురస్కారం 'పద్మ విభూషణ్‌' దక్కింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలను మేరీ కోమ్ గెలిచింది. అత్యద్భుతమైన తన కెరీర్‌లో ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది. రాజ్యసభ ఎంపీగా పని చేస్తున్న ఈ మణిపూర్‌ బాక్సర్‌.. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ కోసం సిద్ధమవుతోంది.
 
మరోవైపు.. గణతంత్ర వేడుకల ముంగిట కేంద్రం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులు ప్రకటించింది. ఏడుగురికి 'పద్మ విభూషణ్', 16 మందికి 'పద్మ భూషణ్', 118 మందికి 'పద్మశ్రీ' అవార్డులు ప్రదానం చేయనున్నారు. మాజీ కేంద్ర మంత్రులు దివంగత అరుణ్ జైట్లీ, సుష్మ స్వరాజ్, జార్జి ఫెర్నాండెజ్ లకు ప్రజా వ్యవహారాల విభాగంలో 'పద్మవిభూషణ్' ప్రకటించారు. 
 
ఇదే విభాగంలో మారిషస్ మాజీ ప్రధాని అనిరుధ్ జగన్నాథ్, భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్‌లకు  కూడా 'పద్మ విభూషణ్' అందించనున్నారు. ఇక, 'పద్మభూషణ్' అవార్డుల విషయానికొస్తే, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను విశిష్ట గౌరవం వరించింది. వినోద రంగం నుంచి కంగన రనౌత్, ఏక్తా కపూర్‌లను 'పద్మశ్రీ' పురస్కారానికి ఎంపిక చేశారు.
 
అయితే పద్మ పురస్కారాల ఎంపికపై విమర్శలు కూడా వస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ సింగర్ అద్నాన్ సమీకి కేంద్రం పద్మశ్రీ పౌర పురస్కారం ప్రకటించడాన్ని మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) తప్పుబట్టింది. భారత పౌరసత్వం తీసుకున్న నాలుగేళ్లకే ఆయనకు పద్మశ్రీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎంఎన్ఎస్  సినిమా విభాగపు అధ్యక్షుడు ఖోప్‌కర్ ప్రశ్నించారు. ప్రభుత్వం తీరు సరికాదని మండిపడ్డారు.