శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (20:28 IST)

తెరపైకి 'జెంటిల్‌మేన్ 2' - ఈ పాన్ ఇండియా మూవీకి దర్శకుడు ఎవరు?

తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో భారీ బ్లాక్‌బస్టర్స్ మూవీలు అందించిన నిర్మాతల్లో కేటీ కుంజుమోన్ ఒకరు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌కు తొలిసారి అవకాశం ఇచ్చిన నిర్మాత కూడా ఈయనే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ "జెంటల్‌మేన్". తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా హీరో యాక్షన్ కింగ్ అర్జున్‌ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 1993లో ఈ చిత్రం వచ్చింది. సంగీత ద‌ర్శ‌కుడు ఏ ఆర్ రెహమాన్ స్వ‌ర‌ప‌రిచిన ఈ మూవీలోని అన్ని పాట‌లు ఇన్‌స్టెంట్ హిట్‌గా నిలిచి దేశ న‌లుమూల‌ల‌కి వినిపించాయి. ఒక చిన్న ప్రేమకథను భారీ స్థాయిలో నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న బడా నిర్మాతగా కుంజుమోన్ చరిత్ర సృష్టించాడు. 
 
ముఖ్యంగా, విద్యావ్యవస్థలోని లోపాలపై పోరాడే ఓ యువకుడి కథతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం నమోదు చేయడమే కాక విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను కూడా కైవసం చేసుకుంది. అప్ప‌టికే శ‌ర‌త్‌ కుమార్ హీరోగా 'వ‌సంత‌కాల ప‌ర‌వై', 'సూర్యన్' భారీ బడ్జెట్ మూవీలను నిర్మించిన మెగా ప్రొడ్యూసర్‌గా కోలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందారు.
 
జెంటిల్‌మేన్ తర్వాత ప్రభుదేవాను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం "కాదలన్" (తెలుగులో ప్రేమికుడు). ఇది కూడా సంచలన విజయం నమోదు చేసుకుంది. అలాగే తెలుగు స్టార్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జునతో కుంజుమోన్ తమిళ, తెలుగు భాషల్లో మాసివ్ బడ్జెట్ మూవీ 'రక్షకుడు' నిర్మించి సంచలనం సృష్టించారు. ఈ చిత్రం ద్వారా మిస్ యూనివర్స్ సుస్మిత సేన్‌ను వెండితెరకు పరిచయం చేశారు. అయితే, ఈ చిత్రం ఆశించిన విజయం సాధించక పోవడంతో నిర్మాత కుంజుమోన్ తీవ్ర నష్టాలను చవిచూశారు. ఫలితంగా అప్పటి నుంచి ఆయన చిత్ర నిర్మాణాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
 
కేవలం చిత్రాలను నిర్మించడమేకాదు.. తన చిత్రాల ద్వారా ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులకు బ్రేక్ ఇచ్చారు. రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌, మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్‌ హీరోలతో సినిమాలు నిర్మించడమే కాకుండా.. కొన్ని వందల చిత్రాలను తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక తన నిర్మాణంలో అపూర్వ విజ‌యాన్ని సాధించిన 'జెంటిల్‌మేన్‌'కు పార్ట్ 2గా, మొదటి భాగానికి రెండింతలు ఉండేలా 'జెంటిల్‌మేన్ 2' చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు ఆయన తాజాగా ప్రకటించారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''జెంటిల్‌మేన్ మూవీ తమిళ‌, తెలుగు భాష‌ల‌లో విడుద‌లై భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అనువాదించ‌బ‌డి అన్ని దేశాల ప్రేక్ష‌కుల‌నుంచి మంచి రెస్పాన్స్ రాబ‌ట్టుకుంది. అయితే మ‌రోసారి అంద‌రి అంచ‌నాల‌ను అందుకునేలా రెండింత‌లు గొప్ప‌ద‌నంతో 'జెంటిల్‌మేన్ 2' తెర‌కెక్కిస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో హాలీవుడ్ చిత్రాల‌కు ధీటుగా లేటెస్ట్ ప్రొడక్షన్ టెక్నిక్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం" అని వివరించారు. 
 
ఈ చిత్రాన్ని త‌మిళ‌, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాష‌ల‌లో జెంటిల్‌మేన్ ఫిలిం ఇంట‌ర్‌నేష‌న‌ల్ సంస్థ‌ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించనుందని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని కేటీ కుంజుమోన్ తెలిపారు. అయితే, ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరన్న అంశంపై ఇపుడు కోలీవుడ్‌లో ముమ్మరంగా చర్చ సాగుతోంది.