ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (11:32 IST)

చరణ్ వ‌ల్లే గాడ్ ఫాదర్, అభిమానులే నా గాడ్ ఫాదర్స్- మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi, Mohanraja and others
Megastar Chiranjeevi, Mohanraja and others
మెగాస్టార్ చిరంజీవి రాయ‌ల‌సీమ వెళ్ళ‌గానే వ‌ర్షం ప‌డింది. దానితో త‌డుచుకుంటూనే స్టేజీపై త‌న స్పీచ్‌ను కొన‌సాగించారు. గాడ్ ఫాదర్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ అనంతపురంలో చాలా గ్రాండ్ గా జరిగింది. వేలాది మంది ప్రేక్షకులు, అభిమానులు హాజరైన ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది. వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది అభిమానులు కోలాహలం మధ్య ఈ వేడుక  విజయవంతమైయింది.
 
ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... నేను ఎప్పుడు రాయలసీమకి వచ్చినా నేల తడుస్తుంది. ఈ రోజు కూడా వర్షం కురవడం ఒక శుభపరిణామంగా అనిపిస్తుంది. మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ చూడటం జరిగింది. ఇది గాడ్ ఫాదర్ గా మారడానికి, నేను చేయడానికి ప్రధానమైన కారణం రామ్ చరణ్. సినిమా బావుంది నాకు వైవిధ్యంగా ఉంటుందని అనుకున్నాను. అయితే ఎవరు చేస్తారని ఆలోచిస్తున్నపుడు.. రామ్ చరణ్ ముందుకు వచ్చి '' మీ ఇమేజ్ కి ఈ సమయంలో చేయాల్సిన సబ్జెక్ట్ లూసిఫర్' అని చరణ్ చెప్పాడు. 
 
చరణ్ కోరిక మేరకు ఇది గాడ్ ఫాదర్ గా రూపాంతరం చెందింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ కి కృతజ్ఞతలు. ఈ సినిమాకి దర్శకుడిగా మోహన్ రాజా పేరుని సూచించింది కూడా రామ్ చరణ్ నే. మోహన్ రాజా ఈ సినిమాని మనందరం గర్వపడేలా తీశారు. దాదాపు ఆరు నెలలు పాటు మిత్రుడు సత్యానంద్ తో కలసి మీ అందరూ ఆనందించేలా ఈ సినిమా స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. ఆ స్క్రీన్ ప్లేని అత్యద్భుతంగా తెరకెక్కించారు మోహన్ రాజ్. మోహన్ రాజా మామూలు దర్శకుడు కాదు. ఆయనవి అన్నీ పెద్ద కోరికలు. ఈ సినిమాలో నాకు దళపతిగా వుండే ఒక పాత్ర వుంది, ఆ పాత్ర కోసం సల్మాన్ ఖాన్ అయితే బావుటుందని చాలా సింపుల్ గా చెప్పారు.


రాజా అంత సింపుల్ గా చెప్పారు కానీ అసలు సల్మాన్ ఖాన్ ని తీసుకురావడం సాధ్యమేనా అని అలిచిస్తున్నపుడు రామ్ చరణ్ ఆ భాద్యత తీసుకున్నారు. ''నాన్న గారి సినిమాలో ఒక పాత్ర వుంది మీరు చేస్తే బావుంటుంది'' అని చరణ్ చెప్పడం,, ''నేను చేయాలని చిరు గారు కోరితే.. ఆ పాత్ర చేయడానికి నేను సిద్ధమే.. కథ కూడా చెప్పొద్దు. నేరుగా షూటింగ్ కి వచ్చేస్తా' అని సల్మాన్ అన్నారు. మాపై ఇంత ప్రేమ చూపించిన సల్మాన్ భాయ్ కి కృతజ్ఞతలు. చరణ్ తో కలసిసూపర్ గుడ్ ఫిలింస్  ఆర్‌బి చౌదరి గారు, ఎన్‌వి ప్రసాద్ గారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించారు. వారికి కృతజ్ఞతలు. నయనతార పాత్ర ఇందులో అత్యద్భుతంగా వచ్చింది. 

 
సెకండ్ హాఫ్ లో అద్భుతమైన సెంటిమెంట్ గొప్పగా పండించారు. నయనతారకి హ్యాట్సప్. ఇందులో ప్రతినాయకుడిగా సత్యదేవ్ చేశారు. నాకు ఎదురుగా నిలబడే పాత్రది. సత్యదేవ్ అద్భుతమైన నటుడు. ఇందులో ఆయన నటనని పరిపూర్ణంగా వాడుకున్నాం. సత్యదేవ్ కి చాలా మంచి భవిష్యత్ వుంది. మన కళ్ళముందే సత్యదేవ్ సూపర్ స్టార్ గా ఎదుగుతాడు. మురళి శర్మ పాత్ర చాలా వైవిధ్యంగా వుంటుంది. సముద్రఖని ఇందులో మరో ప్రతి నాయకుడి గా శభాష్ అనిపించారు, సునీల్, షఫీ, గెటప్ శ్రీను పాత్రలు కూడా ఆసక్తికరంగా వుంటాయి. ఇందులో దర్శకుడు పూరి జగన్నాధ్ ఇందులో యూట్యుబర్ గా కనిపించి పాత్రలని కథని పరిచయం చేస్తారు. ఆయన రాకతో కథలో ఒక ఫ్రెష్ నెస్ వస్తుంది.


వీరంతా కలసి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు.  లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సల్మాన్ భాయ్ ఇందులో తన స్టయిల్, గ్రేస్, మస్కులేన్ లుక్స్, ఫైట్స్ తో నా తరపున మీ అందరినీని అలరిస్తారు. చాలా అద్భుతంగా వచ్చింది సల్మాన్ పాత్ర.  ఇందులో నేను సల్మాన్ ఒక పాట కు డ్యాన్స్ చేశాం. ఇద్దరి స్టార్లని బ్యాలన్స్ చేస్తూ ప్రభుదేవా అద్భుతంగా ఆ పాటని కొరియోగ్రఫీ చేశారు. గాడ్ ఫాదర్ కి ఆరో ప్రాణం తమన్ మ్యూజిక్. తమన్ మ్యూజిక్ తో ఈ సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. కేవలం కంటిచూపుతోని గొప్ప హీరోయిజం తీసుకొచ్చే పాత్రని ఇందులో చేశాను. తమన్ చాలా అద్భుతమైన రీరికార్డింగ్ చేశారు. గూస్ బంప్స్ వస్తాయి. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇందులో చాలా అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు చేశారు. ఇందులో నజభజజజరా పాటని అద్భుతమైన ఫైట్ గా తీర్చిదిద్దారు. 

 
ఈ సినిమాలో పొలిటికల్, ఫ్యామిలీ డ్రామా వుంటుంది. ఈ రెండు కలసి ప్రేక్షకులుని ఆద్యంతం అలరిస్తుందని హామీ ఇస్తున్నాను. సినిమాని చూశాను కాబట్టి ఇంత నమ్మకంగా చెబుతున్నాను. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 విజయదశమి నాడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆదరించి గొప్ప విజయాన్ని ఇవ్వాలి. ఈ మధ్య చేసిన చిత్రం కాస్త నిరాశ పరిచింది. మిమ్మల్ని సరిగ్గా అలరించలేకపోయాననే అసంతృప్తి వుంది. దీనికి సమాధానమే ఈ సినిమా. గాడ్ ఫాదర్  నిశ్శబ్ద విస్పోటనం. మీ అందరి ఆశీస్సులు కావాలి. విజయదశమి మీ జీవితాల్లో కూడా విజయాన్ని తేవాలి. అలాగే అదే రోజు నా మిత్రుడు నటించిన నాగార్జున ది ఘోస్ట్, యువ హీరో గణేష్ నటిస్తున్న స్వాతిముత్యం చిత్రాలు వస్తున్నాయి. ఈ చిత్రాలు కూడా మంచి విజయం సాధించాలి.

 
మేము అనుకున్నదానికంటే పదిహేను రేట్లు ఎక్కువ మంది వచ్చి.. ఇంత వర్షం పడుతున్న ఒక్కరు కూడా కదలకుండా ఈ వేడుకని విజయవంతం చేశారు. ఇది కదా నిజమైన ప్రేమ. ఈ  ప్రేమనే కదా కోరుకునేది. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో నిలబడ్డానని అంటారు. నన్ను ఇక్కడ నిలబెట్టింది నా అభిమానులు. నా అభిమానులే నా గాడ్ ఫాదర్స్. చాలా నిజాయితీగా చెబుతున్న మాట ఇది. మీరు చూపిన అనంతమైన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను.. అందరికీ కృతజ్ఞతలు'' తెలిపారు.