మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2023 (15:52 IST)

సీక్వెల్ మూవీలో నాకెందుకు అవకాశం ఇవ్వలేదు : 'డ్రీమ్‌గర్ల్' బ్యూటీ ప్రశ్న

Nushrratt Bharuccha
'డ్రీమ్‌గర్ల్' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ నుష్రత్ బరుచా. ఆమె తాజాగా ఛత్రపతి హిందీ వెర్షన్‌లో నటించారు. ఈ నెల 25వ తేదీన ఆమె నటించిన అకేలీ చిత్రం విడుదల కానుంది. అదేసమయంలో 'డ్రీమ్‌గర్ల్' మూవీకి సీక్వెల్ కూడా సిద్ధమవుతుంది. కానీ, ఇందులో హీరోయిన్‌గా నుష్రత్‌ను తీసుకోలేదు. అనన్య పాండేను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. దీనిపై నుష్రత్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. 
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, 'డ్రీమ్‌గర్ల్‌' తొలి భాగంలో నేను కథానాయికగా నటించా. ఆ చిత్రబృందం అంటే నాకెంతో ఇష్టం. వాళ్లతో కలిసి వర్క్‌ చేయడాన్ని ఎంతగానో మిస్‌ అవుతున్నా. 'డ్రీమ్‌గర్ల్‌ -2'లో నాకెందుకు ఛాన్స్‌ ఇవ్వలేదో తెలియదు. ఈ ప్రశ్నకు చిత్రబృందం మాత్రమే సమాధానం చెప్పగలదు. నాకు అవకాశం ఇవ్వన్నందుకు ఎంతో బాధపడుతున్నా. విషయం ఏదైనా సరే తమకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాగే, నాక్కూడా ఈ విషయం గురించి బాధపడే హక్కు ఉంది. ఆ బాధ చెప్పే స్వేచ్ఛ కూడా ఉంది' అని ఆమె తెలిపారు.
 
కాగా, ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా తెరకెక్కిన చిత్రం 'డ్రీమ్‌గర్ల్‌'. 2019లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే చిత్రానికి సీక్వెల్‌గా 'డ్రీమ్‌గర్ల్‌-2' సిద్ధమైంది. అనన్యా పాండే కథానాయిక. రాజ్‌ శాండిల్యా దర్శకుడు. ఆగస్టు 25న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే రోజున నుష్రత్‌ నటించిన 'అకేలీ' కూడా విడుదల కానుంది.