టీవీ నటి ప్రాచీ తెహ్లాన్‌కి చేదు అనుభవం.. వెంటాడి అసభ్య పదజాలంతో?
ఢిల్లీలో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు రేకెత్తేలా దేశ రాజధానిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో నలుగురు వ్యక్తులు టీవీ నటి ప్రాచీ తెహ్లాన్‌ని వెంబడించి అసభ్య పదజాలంతో దూషించిన ఘటన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. ఫ్యామిలీ గెట్-టూగెదర్‌లో పాల్గొన్న అనంతరం కారులో భర్తతో కలిసి టీవీ నటి ఇంటికి వెళుతుండగా నలుగురు వ్యక్తులు కారులో వారిని వెంబడించారు.
తాము మధువన్ చౌక్‌కు చేరుకోగానే నలుగురు వ్యక్తులు తమ కారును దాటి రోడ్డుకు అడ్డంగా వారి వాహనాన్ని నిలపడంతో ఎలాగోలా దుండుగులను ఓవర్‌టేక్ చేసి ముందుకు వెళ్లామని నటి పేర్కొన్నారు. అయినా వారు తమను వెంబడించి వేధింపులకు దిగారని, తమ కాలనీ గేటు వరకూ తమను ఫాలో అయ్యారని చెప్పారు.
తాము ఇంటికి చేరుకోగానే వారు వాహనం నుంచి దిగి తనను, తన భర్తను అసభ్యంగా దూషిస్తూ బెదిరించారని, తమపై దాడికి పాల్పడటంతో తన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.