శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (15:22 IST)

50 కోట్ల మంది ఫోన్ నెంబర్లను టెలిగ్రామ్‌కు లీక్ చేసిన ఫేస్‌బుక్..?

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌ వాడకందారుల ఫోన్‌ నంబర్లు టెలిగ్రామ్‌లో అమ్మకానికి పెడుతున్నారని ఒక సెక్యూరిటీ అధ్యయనం వెల్లడించింది. ఫేస్‌బుక్‌ ఐడీలకు చెందిన ఫోన్‌ నంబర్లను టెలిగ్రామ్‌ ఆటోమేటెడ్‌ బోట్‌ను వినియోగించి ఒక సైబర్‌ క్రిమినల్‌ సంస్థ సేకరించి సదరు డేటాను విక్రయిస్తోందని అధ్యయనం తెలిపింది.
 
ఫేస్ బుక్ నిర్వాకం గురించి మొదటగా ట్విట్టర్ ఖాతాలో ఎత్తి చూపిన సెక్యూరిటీ రీసెర్చర్ అలోన్ గాల్ కళ్లు తిరిగే వాస్తవాన్ని వెల్లడించారు. యూజర్లు వాడే టెలిగ్రామ్ బోట్ ద్వారా ఫేస్ బుక్ 50 కోట్ల మంది మొబైల్ నంబర్లను అంగట్లో అమ్మకానికి పెట్టేసిందని గాల్ చెప్పారు. 
 
అన్నిదేశాల్లో ఉండే ఫేస్ బుక్ వినియోగదారుల మొబైల్ ఫోన్లను ఎవరైనా చూడవచ్చు అనే దాన్ని ప్రాతిపదికగా చేసుకుని యూజర్ల అకౌంట్ డేటా బేస్‌ని ఫేస్ బుక్ కొల్లగొట్టిందని గాల్ చెప్పాడు.
 
2020లో ఈ సెక్యూరిటీ క్రైమ్‌ గురించి తొలిసారి తెలిసిందని, వివరంగా పరిశీలిస్తే వివిధ దేశాలకు చెందిన 53.3 కోట్ల మంది యూజర్ల సమాచారం తస్కరణకు గురైనట్లు తెలిసిందని చెప్పారు. ఈ మేరకు కొన్ని స్క్రీన్‌ షాట్లను కూడా ఆయన షేర్‌ చేశారు. ఈ బోట్‌ 2021 జనవరి వరకు యాక్టివ్‌గానే ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
 
ఇదే అంశాన్ని మదర్‌బోర్డ్‌ నివేదిక ధృవీకరిస్తూ, టెలిగ్రామ్‌ బోట్‌ ద్వారా ఈ వివరాలు తస్కరించారని తెలిపింది. ఒక్క యూజర్‌ వివరం కావాలంటే 20 డాలర్లు, పెద్ద ఎత్తున కావాలంటే 10వేల మంది వివరాలకు 5వేల డాలర్లు చెల్లించాలని తెలిపింది. ఇప్పటికైనా ఫేస్‌బుక్‌ తన యూజర్లను ఈ విషయమై హెచ్చరించాలని సూచించింది.