శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (12:50 IST)

వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం.. ఫేస్‌బుక్ - ట్విట్టర్‌లకు కేంద్రం సమన్లు

వాట్సాప్ సరికొత్త ప్రైవసీ పాలసీపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతుండడంతో స్పందించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఫేస్‌బుక్, వాట్సాప్‌ ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు జారీ చేసింది. పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణ, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, డిజిటల్ మాధ్యమాల్లో మహిళల భద్రత వంటి అంశాలపై చర్చించేందుకు ఈ నెల 21న సమావేశం కావాలని పేర్కొన్న స్టాండింగ్ కమిటీ.. కొత్త పాలసీ విధానంపై వస్తున్న ఆరోపణలపై తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు అందించిన ఆధారాలతో పార్లమెంటరీ కమిటీ ప్రతినిధులు ఆ సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు. సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేసిన అంశంపై మాట్లాడనున్నారు. డిజిటల్‌ రంగంలో పౌరుల హక్కుల రక్షణ, సోషల్‌ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో ప్రధానంగా మహిళల భద్రత విషయమై ఈ సమావేశం నిర్వహించనున్నారు.

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ వివాదం నేపథ్యంలో నిన్న సమావేశమైన పార్లమెంటు సమాచార, సాంకేతిక స్టాండింగ్ కమిటీ అనంతరం సామాజిక మాధ్యమ దిగ్గజాలకు సమన్లు జారీ చేసింది. వాట్సాప్ ఇటీవల తమ వినియోగదారులందరికీ కొత్త ప్రైవసీ పాలసీకి సంబంధించిన పాప్ అప్ మెసేజ్‌లు పంపింది. 

కొత్త పాలసీని అందరూ అంగీకరించాల్సిందేనని, లేకుంటే ఖాతా డిలీట్ అయిపోతుందని హెచ్చరించింది. అంతేకాదు, వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని తెలిపింది. ఫిబ్రవరి 8 నుంచే ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

కాగా, ఇటీవల సోషల్‌ మీడియా సంస్థలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఒక పార్టీకి.. కొందరు నాయకులకు మద్దతుగా సోషల్‌ మీడియా వ్యవహరిస్తోందని గుర్తించారు. దీనిపై కొన్ని నెలల కిందట పెద్ద వివాదమే నడిచిన విషయం తెలిసిందే. రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. మొత్తంగా సోషల్‌ మీడియా దుర్వినియోగంపై నియంత్రణ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

అందులో భాగంగా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సంస్థల ప్రతినిధులతో 21వ తేదీన సమావేశమై కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. లేదా కొత్తగా నిబంధనలు విధించి వీటిని తప్పనిసరిగా అమలయ్యేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వాట్సాప్‌ వ్యక్తిగత వివరాల అప్డేట్‌పై రేగిన వివాదం నేపథ్యంలో ఈ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది.