శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2017 (15:04 IST)

సినీ పరిశ్రమ వ్యక్తుల కోసం పనిచేస్తోంది.. టీడీపీ పక్కన పెట్టేసింది: కైకాల సత్యనారాయణ

దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ సినీ పరిశ్రమతో పాటు తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ గతంలో కళల కోసం పనిచేసేదని.. ప్రస్తుతం కొంతమంది కోసమే పనిచేస్తోందని కైకాల అన్నారు. ఎవరినో విమర

దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ సినీ పరిశ్రమతో పాటు తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ గతంలో కళల కోసం పనిచేసేదని.. ప్రస్తుతం కొంతమంది కోసమే పనిచేస్తోందని కైకాల అన్నారు. ఎవరినో విమర్శించాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదని.. చిత్రపరిశ్రమలో ఉన్న విధానం గురించే మాట్లాడుతున్నానన్నారు.

తన సినీ కెరీర్‌పై ఎలాంటి అసంతృప్తి లేదని, భగవంతుడి దయవల్ల అన్ని రకాల పాత్రల్లో తనను ప్రేక్షకులు ఆదరించారని.. విభిన్న రసాలను పండించడం ద్వారా నవరసనటసార్వభౌమ బిరుదు ఇచ్చారని గుర్తు చేశారు. 
 
అదేవిధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన వారిలో తాను కూడా ఒకడిని అని కైకాల అన్నారు. అన్న ఎన్టీఆర్ తనను సొంత తమ్ముడికంటే ఎక్కువగా ఆదరించారని తెలిపారు. అయితే సీనియర్‌ ఎన్టీఆర్‌తో సన్నిహితంగా ఉన్నవారిని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టేసిందని కైకాల ఆవేదన వ్యక్తం చేశారు. 
 
విజయవాడలో శుక్రవారం మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో సత్కారం అందుకోవడానికి వచ్చిన కైకాల మాట్లాడుతూ.. పార్టీ వ్యవస్థాపక సభ్యుడినైన తనను సలహాల కోసం టీడీపీ ప్రభుత్వం ఏనాడూ సంప్రదించలేదన్నారు. టీడీపీ ప్రారంభం నుంచి ఎన్టీఆర్‌తో కలసి తిరిగానని, ఎమ్మెల్యేగా టికెట్‌ ఇవ్వడానికి అన్నగారు ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే విధి అనుకూలించక అది సాధ్యం కాలేదన్నారు.
 
ఆ తర్వాత మచిలీపట్నం నుంచి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచానని తెలిపారు. నమ్మకద్రోహంతో పదవి పోగొట్టుకొన్న సమయంలోనే ఎన్టీఆర్‌ గతంలో ఎప్పుడూ లేనంతగా బాధపడ్డారని గుర్తు చేసుకున్నారు. పురస్కారాలు నటీనటుల బాధ్యతను మరింత పెంచుతాయని చెప్పారు.