బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (13:28 IST)

వంగవీటి రంగా భార్య, బిడ్డ రంగుపై వర్మ కామెంట్స్... స్వర్గంలో బ్రేక్ డ్యాన్స్ చేస్తుంటారట...

టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈయన దర్శకత్వంలో "వంగవీటి" చిత్రం నిర్మితమై విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలపై వంగవీటి ఫ్యామిలీ అభ్యంతరాలు వ్య

టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈయన దర్శకత్వంలో "వంగవీటి" చిత్రం నిర్మితమై విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలపై వంగవీటి ఫ్యామిలీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పైగా, చిత్ర విడుదల సమయంలో కొన్ని చిక్కులు కూడా తలెత్తాయి. ఆ సమయంలో వంగవీటి కుటుంబానికి దర్శకుడు రాంగోపాల్ వర్మ మధ్య కూడా మనస్పర్థలు తలెత్తాయి. 
 
ఈ నేపథ్యంలో విజయావాడలో వైకాపాకు చెందిన రెండు వర్గాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో వంగవీటి రంగాపై తీవ్ర విమర్శలు చేసి వైసీపీ నుంచి సస్పెండైన నేత గౌతం రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇప్పటికే విజయవాడ అట్టుడుకిపోతోంది. ఇలాంటి తరుణంలో రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో చేసిన వివాదాస్ప వ్యాఖ్యలు మరింత ఆజ్యంపోశాయి. 
 
"తన కుమారుడు, భార్యలను చూసి వంగవీటి రంగా ఎంతో గర్వపడుతుంటారని... స్వర్గంలో బ్రేక్ డ్యాన్స్ కూడా చేస్తుంటారని" కామెంట్ చేశాడు. తనకు కూడా వంగవీటి రంగా భార్య, కుమారుడు అంటే ఎంతో అభిమానమని చెప్పాడు. తల్లి నల్లగా, కుమారుడు తెల్లగా ఎందుకున్నారో ప్రముఖ కాస్మోటిక్స్ సంస్థ 'లోరియల్' చెప్పాలని అన్నాడు. అంతేకాదు పోలీస్ స్టేషన్‌లో రత్నకుమారి, రాధాలు నేలపై కూర్చున్న ఫొటోను కూడా అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలతో పాటు... వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
ఇదిలావుండగా, విజయవాడలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. వైసీపీలో రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. దివంగత వంగవీటి రాధ, రంగాలపై వైసీపీ నేత గౌతం రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ నేత రాధా, ఆయన తల్లి రత్నకుమారి విలేకరుల సమావేశంలో మాట్లాడేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
 
ఈ క్రమంలో పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రాధ, రత్నకుమారి కిందపడిపోయారు. రాధా వేసుకున్న చొక్కా చిరిగిపోయింది. తన తల్లి కిందపడిపోవడంతో రాధా కన్నీరు పెట్టుకున్నారు. కాగా, రాధాను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించగా, ఆయన స్టేషన్‌లో నేలపైనే కూర్చుండిపోయారు.