మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 19 జనవరి 2019 (15:48 IST)

ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డిగా అనసూయ... యాత్రకు డబ్బింగ్ చెప్పిన మమ్మూట్టి (Video)

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "యాత్ర". ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి.. వైఎస్ఆర్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో తన పాత్రకి ఆయనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ వెల్లడించింది. 
 
ఈ చిత్రంలో వైఎస్ఆర్ తండ్రి వైఎస్.రాజారెడ్డి పాత్రలో హీరో నుంచి విలన్‌గా మారిన జగపతిబాబు నటించారు. వచ్చే నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్లు విడుదల చేయగా, అవి మంచి హైప్ తెచ్చిపెట్టాయి. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో బుల్లతెర యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్రను పోషించనున్నారు. తెలుగు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డిగా రంగమ్మత్త కనిపించనున్నారు. 
 
2004వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నందికొట్కూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి చరితా రెడ్డి ఏ విధంగా గెలిచారు? ఆనాటి పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొన్నారు? కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ఆమె చేసిన కృషిని 'యాత్ర'లో చూపించనున్నారని సమాచారం. 
 
ఈ చిత్రాన్ని శివ మేకా సమర్పణలో 70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశిలు నిర్మిస్తున్నారు. ఇందులో రావు రమేష్, పోసాని కృష్ణమురళి, వినోద్ కుమార్, సచిన్ ఖేడ్కర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.