శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (18:36 IST)

తెలంగాణాలో థియేటర్లు మూసివేత.. 'వకీల్ సాబ్‌'కు మినహాయింపు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ వైరస్ ఉధృతికి నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా అనేక మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కరోనా బాధితుడుగా ఉన్నారు. 
 
ఈ కరోనా ప్రభావం సినిమా థియేటర్లపైనా పడింది. వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో బుధవారం నుంచి థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏకగీవ్ర నిర్ణయం తీసుకున్నారు.
 
మంగళవారం సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటించిన "వకీల్‌ సాబ్‌" సినిమా ప్రదర్శించే థియేటర్లు మినహా మిగితా వాటిని మూసివేయాలని సమావేశంలో నిర్ణయించారు.
 
కరోనా ఉధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లు థియేటర్ల నిర్వాహకులు తెలిపారు. కాగా, వకీల్ సాబ్ చిత్రాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన విషయం తెల్సిందే.