శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:16 IST)

బండి సంజయ్‌కు చెప్పకుండా కేసీఆర్‌ను ఎలా కలుస్తారు? అమిత్ షా ఆగ్రహం!

ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లింగోజిగూడ కార్పొరేటర్‌ ఎన్నిక జరగాల్సివుంది. దీన్ని ఏకగ్రీవం చేసే విషయమై మాట్లాడేందుకు ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వద్దకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప‌లువురు బీజేపీ సీనియర్ నేతలు వెళ్లారు. అయితే, పార్టీ అనుమతి లేకుండా బీజేపీ నేతలు ప్రగతి భవన్‌లో తెలంగాణ‌ మంత్రి కేటీఆర్‌ను కలవడంపై బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. 
 
ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కేంద్రం హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. కేటీఆర్‌ను క‌లిసి వారిపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. కేటీఆర్‌ను బీజేపీ నేత‌లు క‌ల‌వ‌డంపై నిజనిర్ధారణ క‌మిటీ వేసి, చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పార్టీ అధిష్టానం ఆదేశించింది. 
 
కేటీఆర్‌ను క‌లిసిన స‌మ‌యంలో బండి సంజయ్‌పై స‌ద‌రు మంత్రి ప‌లు కామెంట్లు చేసినా బీజేపీ నేత‌లు ఎందుకు ఉపేక్షించారన్న విష‌యంపై కూడా నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ఆరా తీయ‌నుంది. క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని బండి సంజ‌య్‌కు అధిష్టానం నుంచి ఆదేశాలు రావ‌డంతో మంగళవారం ఆయ‌న దాన్ని ఏర్పాటు చేశారు. 
 
ఇందులో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఉన్నారు. రెండు రోజుల్లో తనకు రిపోర్ట్‌ ఇవ్వాలని కమిటీని బండి సంజయ్‌ ఆదేశించారు. కేటీఆర్‌తో భేటీ సందర్భంగా ప్రగతి భవన్‌లో ఏమి జరిగిందనే విష‌యంపై ఈ త్రిసభ్య కమిటీ తేల్చనుంది.