శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (13:12 IST)

‘మా’ భవనంపై వివాదం.. మోహన్ బాబుకు కౌంటరిచ్చిన నాగబాబు.. ఏంటి సంగతి?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగనున్న వేళ.. ‘మా’ భవనంపై వివాదం ముదురుతోంది. ఈ విషయంపై సీనియర్ నటుడు మోహన్​బాబుకు నటుడు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలు ఉన్నాయనే మోహన్​బాబు ‘మా’ భవన నిర్మాణ విషయాన్ని తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. టీవల జరిగిన ‘మా’ సభ్యుల జూమ్ మీటింగ్‌లో ‘మా’ కోసం బిల్డింగ్ కొనడం, కొన్నదానికంటే తక్కువ రేటుకి అమ్మడం ఎందుకు చెయ్యాల్సి వచ్చిందనేదాని గురించి సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రశ్నిస్తూ విమర్శలు చేశారు.. రీసెంట్‌గా మెగా బ్రదర్ నాగబాబు, ఆయన వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ తన ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు.
 
దీనిపై నాగబాబు స్పందిస్తూ.. "మా అసోసియేషన్‌కు నేను ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో అంటే 2006 నుంచి 2008 వరకు బిల్డింగ్‌ను కొన్నాం. అంతకు ముందు నుంచే బిల్డింగ్ సమస్య ఉంది. చాంబర్ వాళ్లు మమ్మల్ని ఖాళీ చేయమని ఒత్తిడి తెచ్చేవారు. అలా అప్పుడు కొత్త బిల్డింగ్ కొనాల్సి వచ్చింది. కానీ ప్రతీ సారి ఎన్నికల్లో మా బిల్డింగ్ కొన్నారు.. అమ్మారు అంటూ కామెంట్లు చేస్తూ వచ్చారు. ఎవరో చిన్నవాళ్లు అంటే నేను స్పందించే వాడిని కాదు. కానీ మోహన్ బాబు లాంటి వారు అడిగారు. మొన్న మా అసోసియేషన్‌కు జూమ్ మీటింగ్ జరిగింది. అది బయటకు రాకూడదు. ఎలా బయటకు వచ్చిందో. 
 
కండక్ట్ చేసిన వాళ్లు చూసుకోవాలి. ఇందులో మోహన్ బాబు గారు ఎందుకు మా బిల్డింగ్ కొన్నారు.. ఎందుకు అమ్మారు.. అంటూ అడిగారు. కానీ ఆయన నా పేరు ఎత్తలేదు. మోహన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీలో ఓ పెద్ద మనిషి. ఆయన అడగడంలో తప్పు లేదు. ఇది ఆరోజే అడగాల్సింది. కానీ ఇంత ఆలస్యంగా అడిగారు. అడగడం మంచిదే. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే.. ఎన్నికల్లో భాగంగానే అడిగి ఉండొచ్చు. అది జరిగి కూడా దాదాపు పద్నాలుగేళ్లు అవుతోంది. ఇప్పుడు మాట్లాడాలని ఆయనకు కోరిక వచ్చి ఉంటుంది. ఎన్నికల్లో భాగంగా మా సంక్షేమం కోసం, విష్ణు గారిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అడిగి ఉంటారు. ఆయన అడిగారనే వివరణ ఇస్తున్నానని నాగబాబు అన్నారు. 
 
చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లు బిల్డింగ్ ఖాళీ చేయమని తీవ్రంగా ఒత్తిడి చేశారు. అయితే ఆ సమయంలో మా వద్ద అన్నీ కలుపుకుని దాదాపు కోటీ ఇరవై, ముప్పై లక్షలు ఉన్నాయి. అయితే పరుచూరి గోపాలకృష్ణ సలహా, సూచనలతో శ్రీనగర్ కాలనీలో డైరెక్టర్స్ అండ్ రైటర్స్ అసోసియేషన్ బిల్డింగ్‌కు దగ్గర్లో ఓ భవనాన్ని కొన్నాం. చిన్న వాళ్లకు అందరికీ అందుబాటులో ఉంటుంది.. అందరం అక్కడే ఉంటాం అని పరుచూరి చెప్పడం వల్ల అక్కడ ఓ బిల్డింగ్ కొన్నాం. 140 స్క్వేర్ యార్డ్స్ స్థలంలో ఉన్న భవనాన్ని రూ. 71 లక్షలకు కొన్నాం. ఇంకో మూడు లక్షలతో రిపేర్ చేయించాం. మరో రూ.15 లక్షలతో రెన్యువేట్ చేయించాం. 
 
మొత్తం 96 లక్షలు ఖర్చు అయింది. అయితే ఆ తరువాత 2017లో ఆ బిల్డింగ్‌ను శివాజీ రాజా అధ్యక్షుడిగా, నరేష్ జనరల్ సెక్రటరీగా ఉన్న సమయంలో అమ్మేశారు. అది కూడా చాలా తక్కువ రేటుకే అమ్మేశారు. దాన్ని నడపడం భారమైందనే కారణం చెప్పారు. ఎందుకు ఎలా భారమైందో చెప్పాలి. పైగా 95లక్షలు అంచనా చేసి.. 35 లక్షలకు బేరం పెట్టారు. 30 లక్షల తొంబై వేలకు అమ్మేశారు. 
 
దాని విలువ ఎక్కువ ఉంటుదని మా చార్టెడ్ అకౌంట్ చెప్పినా వినలేదు. అయితే ఆ భూమి విలువే.. దాదాపు కోటి నలబై లక్షలు ఇప్పుడు. ఆ 30లక్షలు కూడా ఏం చేశారో తెలియదు. అంత తక్కువకు బిల్డింగ్ అమ్మింది కూడా నరేష్. అంటే మీకు మద్దతుగా తిరుగుతున్న వారే. ఎందుకు కొనాల్సి వచ్చిందో నేను చెప్పాను. ఇక ఎందుకు అమ్మాల్సి వచ్చిందో ఆయన్ను చెప్పమనండి. మాకు కూడా చెప్పండి” అని నాగబాబు పేర్కొన్నారు.