శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 జులై 2019 (17:36 IST)

రివర్స్‌ స్క్రీన్‌ప్లేతో కొత్తగా అనిపించే 'నేనులేను' - ప్రీమియర్‌ రివ్యూ

'నేను లేను' అని టైటిల్‌ పెట్టడంతో ఏదో కొత్తగా వుందనేలా ఆసక్తి రేకెత్తించాడు దర్శకుడు. 'లాస్ట్‌ ఇన్‌ లవ్‌' అనేది ఉపశీర్షిక పెట్టడంతో ప్రేమలో ఇంతకంటే చివరిది లేదనే అర్థంతో వచ్చిన ఈ చిత్రం సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందించారు. ట్రైలర్‌లోనే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసిన దర్శక నిర్మాతలు కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించారు. నటీనటులపరంగా కూడా ప్రెష్‌లుక్‌తో ఉన్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదలవుతుంది. ముందుగానే ఈ చిత్రాన్ని కొంతమంది ప్రముఖులకు ప్రీమియర్‌ వేశారు. ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
నటీనటులు: హర్షిత్‌, వంశీకష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్‌నాధ్‌ తదితరులు
 
సాంకేతికత:  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌ కుమార్‌, నిర్మాత: సుక్రి కుమార్‌. బేనర్లు: ఓ.యస్‌.యం విజన్‌, దివ్యాషిక క్రియేషన్స్‌.
 
కథ:
తన స్నేహితుడు వీడియోగ్రాఫర్‌తో కలిసి ఈశ్వర్‌ (హర్షిత్‌) కర్నూల్‌లో వీడియోలు తీస్తూ ఆసక్తికరమైన టాపిక్‌లతో ఎట్రాక్ట్‌ చేస్తుంటాడు. ఆ సందర్భంలో పార్వతి (శ్రీపద్మ)ని తొలిచూపులోనే ఇష్టపడతాడు. ఆమె ప్రేమపొందేందుకు ప్రయత్నించి సక్సెస్‌ అవుతాడు. కులాలు వేరయినా పార్వతి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించరు. దాంతో ఎవరికీ చెప్పకుండా లేచిపోదామనే కాన్సెప్ట్‌కి వచ్చేస్తారు. అక్కడా ఎదురుదెబ్బ తగులుతుంది. 
 
అనుకోని స్థితిలో ఈశ్వర్‌పై కొందరు దాడిచేస్తారు. దాంతో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా ప్రవర్తించే ఓ సైకలాజికల్‌ డిజార్డర్‌ స్థితికి చేరుకుంటాడు. మరోవైపు ఈశ్వర్‌పై ఎటాక్‌ చేసిన వారంతా చనిపోతారు. ఒక దశలో ఈశ్వర్‌ చనిపోయాడనీ పోలీసులకు తెలుస్తుంది. కానీ అతను బతికున్నాడని తెలియడంతో పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలింది. సైకలాజికల్‌గా ఈశ్వర్‌ ఎలా డిస్ట్బర్బ్‌ అయ్యాడు. తదనందర పరిణామాలేమిటి? అనేవి మిగిలిన సినిమా.
 
విశ్లేషణ: 
థ్రిల్లర్‌ జోనర్స్‌తో పలు రకాల కథలు వచ్చాయి. కానీ ఈశ్వర్‌ వున్నాడని కొందరు లేడని కొందరు అనే కాన్సెప్ట్‌తో వచ్చే రివర్స్‌ స్క్రీన్‌ప్లే కథ కొత్తగా వుందనే చెప్పాలి. ఒకరకంగా చాలా రిస్క్‌తో కూడుకున్న ఈ కథను దర్శకుడు అర్థమయ్యేరీతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో ప్రేక్షకుడికి థ్రిల్‌ కల్గిస్తూ కొంత గందరగోళపరిచే పనిచేశాడు. హీరోకు వచ్చే ఓ సైకలాజికల్‌ డిజార్డర్‌ను దర్శకుడు రామ్‌ కుమార్‌ ఎమ్‌.ఎస్‌.కె. బాగా ఎస్టాబ్లిష్‌ చేశాడు. రొటీన్‌ కథ, కథనం కాకుండా కొత్తగా ట్రై చేసి సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. సాధారణంగా ఇలాంటి స్క్రీన్‌ ప్లే హాలీవుడ్‌ సినిమాల్లో చూస్తుంటాం. 
 
ఈ సైంటిఫిక్‌ డిజార్డర్‌ ఎలా వస్తుందనేది చెప్పే ప్రయత్నం చేశాడు. టైటిల్‌కు తగ్గ కథ, కథనం కుదిరాయి. అవసరమైన చోట రొమాంటిక్‌ సీన్స్‌తో వేడెక్కించాడు. హీరో హీరోయిన్స్‌ మధ్య మంచి కెమిస్ట్రీ బాగా కుదిరింది. వారిద్దరి సీన్స్‌లో ఒకరినొకరు ఆటపట్టించే క్రమంలో వచ్చేవి రొమాంటిక్‌గా వుంటాయి. ఒక్కోసారి డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌తో సీన్స్‌ పండించాడు. మొదటిభాగం సరదాగా సాగుతూ ట్విస్ట్‌తో బ్రేక్‌ పడుతుంది. ఇక రెండోభాగంలో కథనం సాగుతుంది. దీన్ని మరింత బాగా టేకప్‌ చేసుంటే మరింత ఆసక్తికరంగా వుండేది. హీరోయిన్‌ శ్రీపద్మ అందం అభినయంతో ఆకట్టుకుంది. పెర్‌ ఫార్మెన్స్‌కు అవకాశం ఉన్న పాత్రలో నటించింది. ఈశ్వర్‌ స్నేహితుడుగా నటించిన వ్యక్తి కథకు మలుపు. తనేం చేశాడనేడి తెరపై చూడాల్సిందే. 
 
సాంకేతికంగా ఛాయాగ్రహణం. ఎ.శ్రీకాంత్‌ (బి.ఎఫ్‌.ఎ) నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఆశ్రిత్‌ అందించిన పాటలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమాకు మెయిన్‌ హైలైట్‌ చాలా సీన్స్‌తో తన ప్రతిభ చూపించాడు. పరిమిత బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం చూడ్డానికి పెద్ద చిత్రంగా అనిపిస్తుంది. సుక్రి కుమార్‌ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. ఒక అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఇందులోని థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌ ప్రేక్షకులను ఆధ్యంతం ఉత్కంఠకు గురి చేస్తాయి. లాజిక్‌కు అందని అంశాలకు ముగింపులో ఇచ్చిన వివరణతో ప్రేక్షకుడు ఏకీభవిస్తాడనే చెప్పాలి. యూత్‌ను ఆకట్టుకునే అంశాలున్న ఈ చిత్రం ఆకట్టుకుందని చెప్పవచ్చు.