శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (17:21 IST)

చరణ్‌కు నాకు దిష్టి తగులుతుందేమో : ఎన్‌టీఆర్

ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాలను వెల్లడించిన రాజమౌళి, ఈ మీడియా సమావేశానికి తనతో పాటు రామ్‌చరణ్, ఎన్‌టీఆర్‌తో పాటు నిర్మాత దానయ్యను కూడా తీసుకొచ్చాడు. ఈ సినిమా నేపథ్యం, ఇందులో నటించే నటీనటులు వంటి ఇతరత్రా సమాచారాన్ని రాజమౌళి వెల్లడించాడు. ఈ మీడియా సమావేశంలో మాట్లాడిన జూనియర్ ఎన్‌టీఆర్ మాట్లాడుతూ చాలా భావోద్వేగానికి గురయ్యాడు.
 
ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ మాట్లాడుతూ 'ఈరోజు చాలా టెన్షన్ పడుతున్నాను, రాజమౌళి గారితో నాకు ఇది నాలుగో సినిమా, ఖచ్చితంగా ఈ సినిమా నాకు ప్రత్యేకమైనదే. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా చేయడం ఒక విశేషం అయితే మరోవైపు చరణ్‌తో కలిసి నటిస్తున్నాను కాబట్టి ఈ సినిమా నా కెరీర్‌లో మైలురాయిలా మిగిలిపోతుంది. చరణ్‌తో నా స్నేహం ఇప్పటిది కాదు, నా కష్టసుఖాలు పంచుకునే మిత్రుడు చరణ్, మేము ఎప్పటికీ ఇలాగే మంచి స్నేహితులుగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. మాకు ఎలాంటి దిష్టి తగలకూడదు' అని చెప్పాడు.
 
ఇంకా మాట్లాడుతూ 'ఈ సినిమా ప్రారంభం కావడానికి ముందు మేము చేసిన వర్క్‌షాప్స్, శిక్షణ చాలా అద్భుతం. మేము తీసుకున్న శిక్షణ వర్ణనాతీతం, ఈ శిక్షణ మా భవిష్యత్ సినిమాలకు ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను. ఈ చిత్రంలో నటులుగా ఉండటం మేము చేసుకున్న అదృష్టం. జక్కన్నపై మాకు, ప్రేక్షకులకు ఉన్న విశ్వాసమే ఈ సినిమాకు విజయాన్ని అందిస్తుంది' అని చెప్పారు.