బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 మార్చి 2018 (08:33 IST)

ఫిబ్రవరి 24న ఏం జరిగింది? శ్రీదేవి ఎలా చనిపోయింది? బోనీ కపూర్ కోణం నుంచి...

అందాల నటి శ్రీదేవి గత నెల 24వ తేదీన హఠాన్మరణం చెందారు. దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో ఆమె ప్రమాదవశాత్తు స్నానపుతొట్టిలో పడిప్రాణాలు కోల్పోయారు. ఈ మరణంతో దేశం ఒకింత షాక్‌కు గురైంది.

అందాల నటి శ్రీదేవి గత నెల 24వ తేదీన హఠాన్మరణం చెందారు. దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో ఆమె ప్రమాదవశాత్తు స్నానపుతొట్టిలో పడిప్రాణాలు కోల్పోయారు. ఈ మరణంతో దేశం ఒకింత షాక్‌కు గురైంది. శ్రీదేవి అభిమానులు ఇప్పటికీ ఆమె చనిపోయారన్న వార్తను నమ్మలేక పోతున్నారు. జీర్ణించుకోలేకపోతున్నారు. హోటల్‌లో ఏదో జరిగిందన్నదానిపై విభిన్న కథనాలు వినొస్తున్నాయి. అయితే, ఓ బ్లాగ్‌లో "ఆ రోజు ఎం జరిగింద"నే విషయంపై బోనీ కపూర్ కోణం నుంచి ఓ కథనం ప్రచురితమైంది. ఆ కథనం వివరాలను పరిశీలిస్తే, 
 
దుబాయ్‌లో మా బంధువుల పెళ్లి కోసం గత నెల 20వ తేదీన నేను, నా భార్య శ్రీదేవి, కుమార్తె ఖుషీతో కలిసి దుబాయ్ వెళ్లాం. ఈ వివాహం తర్వాత అంటే 22వ తేదీన నాకు లక్నోలో కీలక సమావేశం ఉండటంతో దుబాయ్‌ నుంచి నేను భారత్‌కు వచ్చేశాను. శ్రీదేవి మాత్రం 22, 23 తేదీల్లో జుమేరా ఎమిరేట్స్‌ టవర్‌ హోటల్‌లోని రూమ్‌ నంబర్‌ 2201లో బసచేసి రిలాక్స్ అవుతూ వచ్చింది. ఆ రెండు రోజులు జాన్వీ కోసం షాపింగ్ చేసింది. 24వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు నేను దుబాయ్ వెళ్లేందుకు విమాన టికెట్‌ బుక్‌ చేసుకున్నాను. ఈ విషయం శ్రీదేవికి చెప్పకుండా, దుబాయ్‌ కాలమానం ప్రకారం సాయంత్రం 6.20 గంటలకు జువేరా హోటల్‌కు చేరుకున్నాను. అక్కడ ఆమెను సర్‌ప్రైజ్‌ చేసి.. ఇద్దరం కలిసి ఓ పావు గంటపాటు గడిపాం. ఆ తర్వాత రొమాంటిక్ డిన్నర్‌కు వెళ్దామని నేనే ప్రతిపాదన చేయగా, ఆమె సరేనని చెప్పి ఫ్రెషప్ అయ్యేందుకు బెడ్‌రూమ్ బాత్‌రూమ్‌కు వెళ్లింది. 
 
పిమ్మట నేను లివింగ్ రూమ్‌కు వచ్చి టీవీ ఆన్ చేసి చూస్తున్నాను. 15-20 నిమిషాల తర్వాత కూడా బయటకు రాకపోవడంతో గట్టిగా పిలిచాను. అపుడు సమయం రాత్రి 8 గంటలు. అప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి డోర్‌ కొట్టి.. మళ్లీ శ్రీదేవిని పిలిచాను. ఎంతసేపటికీ డోర్‌ తీయకపోవడం.. లోపలి నుంచి ట్యాప్‌ అన్‌ చేసి ఉన్న శబ్దం రావడంతో ఆందోళన చెంది డోర్‌ తెరిచే ప్రయత్నం చేశాను.
 
లోపల బోల్ట్‌ పెట్టకపోవడంతో డోర్‌ వెంటనే తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూస్తే బాత్‌టబ్‌లోని నీటిలో పూర్తిగా మునిగిపోయి ఉంది. దీంతో షాక్‌కు గురై... ఎటువంటి చలనం లేకుండా శ్రీదేవిని చూస్తూ ఉండిపోయాను. శ్రీదేవి మునిగిపోయింది.. బోనీ ప్రపంచం బద్దలైపోయింది. శ్రీదేవిని బోనీ సర్‌ప్రైజ్‌ చేసిన రెండు గంటల్లోనే అంతా జరిగిపోయింది. 
 
నిజానికి గత 24 ఏళ్లలో నేను, శ్రీదేవి కలసి విదేశాలకు వెళ్లకపోవడం రెండుసార్లే జరిగింది. సినిమా ప్రదర్శనల కోసం న్యూజెర్సీ, వాంకోవర్‌లకు శ్రీదేవి వెళ్లింది. అప్పుడు నేను ఆమెతో లేను. అయితే నా స్నేహితుని భార్యను శ్రీదేవికి తోడుగా పంపాను. రెండు రోజులు శ్రీదేవి ఒంటరిగా ఓ విదేశీ గడ్డపై ఉండటం మాత్రం దుబాయ్‌లోనే జరిగింది. అదీ జాన్వి షాపింగ్ కోసం. నిజానికి శ్రీదేవి ఒంటరితనాన్ని భరించలేదు. పైగా, పాస్‌పోర్ట్, ఇతర కీలకమైన పత్రాలను ఎక్కడో పెట్టి మరిచిపోతుంది. ఈ విషయంపై జాన్వి ఎపుడూ ఆందోళన చెందుతూనే ఉండేది. ఇదీ ఆ కథనం సారాంశం.