ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 24 డిశెంబరు 2024 (21:30 IST)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

pawan kalyan
Pawan Kalyan Prabhalu జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తను బాధ్యత తీసుకున్న దగ్గర్నుంచి సమస్యలనేవి పారిపోతున్నాయంటూ ఇపుడు ఏపీ ప్రజలు చాలామంది అనుకోవడం వినిపిస్తోంది. ఆయన దృష్టికి ఏ సమస్య వచ్చినా సంబంధిత శాఖతో చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై పనులను ఎలా పరిష్కరించాలో చేసి చూపిస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో విరివిగా పర్యటించారు. అక్కడ అడుగడుగునా వున్న సమస్యలన్నీ జాబితా చేసుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు.
 
రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రహదారులను నిర్మించారు. ఈ ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన రహదారులను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. ముఖ్యంగా, జిల్లాలోని అరకు వ్యాలీ నియోజకవర్గం పరిధిలో హుకుంపేట మండలం, గూడా రోడ్డు నుండి సంతబయలు వరకు మర్రిపుట్టు గ్రామం మీదుగా 2 కిలోమీటర్లు మేర రూ 90.50 లక్షల అంచనాతో తారు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. 
 
ఈ తారు రోడ్డు పంచాయతీ రాజ్ విభాగంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులు ద్వారా నిర్మాణం పూర్తి చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో 170 జనాభా కలిగిన మర్రిపుట్టు గ్రామానికి డోలి మోతలు నివారించి, విద్య, వైద్య, వ్యాపార పరమైన వసతులకు ప్రభుత్వం మరింత చేరువ చేసింది. 
 
ఈ తారు రోడ్డు నిర్మాణం జరగక ముందు ప్రజలు ఆసుపత్రికి వెళ్ళాలన్నా, విద్యార్థులు పాఠశాలకు వెళ్ళాలన్నా, ఏ అవసరం వచ్చినా చాలా ఇబ్బంది పడేవారు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి అరకు నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఉత్తరాంధ్రలోని సమస్యలను వరుసగా పరిష్కరిస్తూ... ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు, పవన్ ఆదేశాలతో గతుకులు లేని రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సంక్రాంతి పండుగకి ఇక్కడి ప్రజలు పవన్ కల్యాణ్ ప్రభలతో సంబరాలు చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.