మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (12:43 IST)

నేను యాక్టర్‌‌ని అయితే.. మరి జగన్‌ ఎవరు?

తెదేపాలో జనసేన భాగస్వామేనంటూ వైకాపా అధినేత జగన్‌ చేస్తున్న వ్యాఖ్యలపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. దొంగపొత్తులు పెట్టుకోవలసిన అవసరం జనసేనకు లేదని తేల్చి చెప్పిన ఆయన... తల తెగిపడినా జగన్‌లా మోడీ, అమిత్‌షాల ముందు మోకరిల్లబోమని స్పష్టంచేసారు.
 
ఈ మేరకు ప్రకాశం జిల్లా గిద్దలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన పవన్.. తాను యాక్టింగ్‌ వదిలేసి పూర్తి స్థాయి రాజకీయాలలోకి వచ్చానన్నారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తనను యాక్టర్‌ అని జగన్‌ పిలిస్తూంటే.. మరి జైలులో ఉండి వచ్చిన ఆయనను తాను ఎలా పిలవాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు. 
 
రాష్ట్రానికి  ప్రత్యేక హోదా, ప్రకాశం జిల్లాకు వెనుకబడిన నిధులు ఇవ్వని కేంద్రం వద్ద తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోనన్న పవన్... తెరాస, భాజపాలతో పొత్తులపై బహిరంగంగా ప్రకటించాలని వైకాపాను డిమాండ్‌ చేసారు. 
 
కాగా... తాము అధికారంలోకి వస్తే... పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు కోచింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన పవన్‌... ప్రకాశం జిల్లాను ఎవరూ చేయని రీతిలో అభివృద్ధిచేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని కూడా భరోసా ఇచ్చారు.